విజయనగరం జిల్లా పార్వతీపురం లయన్స్ క్లబ్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. కొన్నేళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చే శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. రక్తదానం శిబిరాలు నిర్వహణతో పాటు.. సామాజిక రుగ్మతలను పారద్రోలే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి పేదలకు కడుపు నింపాలనే ఆలోచన చేశారు. కొన్ని నెలల క్రితం ప్రాంతీయ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ అక్షయ పాత్ర అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
క్లబ్ అధ్యక్షుడు గొర్లి మాధవరావు అధ్యక్షతన సభ్యులు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ప్రాంతీయ ఆసుపత్రికి రోజుకి వందలాది మంది రోగులు వస్తున్నారు. వంద పడకల ఆసుపత్రిలో 200 మందికిపైగా రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. రోగులతో పాటు సహాయకులు ఆస్పత్రిలో ఉంటున్నారు. రోగులకు ప్రభుత్వం మూడు పూటల ఆహారం అందిస్తోంది. సహాయకులు మాత్రం బయట హోటల్స్‌లో తినాల్సిన పరిస్థితి.
ఆర్థిక స్తోమత లేనివారు, బయటికి వెళ్లలేనివారు, హోటల్స్ తెలియని వారు సకాలంలో ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉంది. అటువంటి వారి కడుపు నింపాలని లయన్స్ క్లబ్ సభ్యులు నిర్ణయించుకున్నారు. వారంలో ఒకరోజు రోగుల సహాయకులకు ఆహారం అందించాలని తొలుత భావించారు. కొన్నాళ్లపాటు అలా నడిపించారు. కొద్దిరోజులుగా దాతలు ముందుకు వచ్చారు. వారి సహకారంతో క్లబ్ సభ్యులు ప్రస్తుతం ప్రతి రోజు మధ్యాహ్నం ఆహారం అందిస్తున్నారు.