ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

High court: సంచైత, రాష్ట్ర ప్రభుత్వ అప్పీళ్ల కొట్టివేత - హైకోర్టు వార్తలు

మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును పునరుద్ధరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపి వేయడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. స్టే కోరుతూ సంచైత గజపతిరాజు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది.

High court
High court

By

Published : Aug 12, 2021, 6:23 AM IST

మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును పునరుద్ధరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపి వేయడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వాలంటూ సంచైత గజపతిరాజు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. స్టే కోరుతూ వారు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ప్రధాన అప్పీళ్లపై విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం 3 అప్పీళ్లు, సంచైత గజపతిరాజు మరో మూడు అప్పీళ్లను వేశారు.

మరోవైపు మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా తనను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 73ను రద్దు చేస్తూ... హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ ఊర్మిళ గజపతిరాజు దాఖలు చేసిన అప్పీల్లో మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది.

ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాదా?

అశోక్‌ గజపతిరాజు

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. న్యాయపరంగా ఎదురు దెబ్బలు తగులుతున్నా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. సింహాచలంలో సీతారాముల ఆలయంలో ధ్వజస్తంభం కూలడంపై అధికారుల వివరణ కోరతానన్నారు. హైకోర్టు చెప్పినా ఇప్పటివరకు ఈవో తనను కలవలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా గత ఛైర్మన్‌ సంచైత, ట్రస్టు సొమ్ము రూ.కోటితో మూడు కార్లు కొనుగోలు చేశారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

గ్రామం యూనిట్​గా టీకా పంపిణీ జరగాలి: సీఎం జగన్

పార్లమెంట్​ నిరవధిక వాయిదా.. కీలక బిల్లుల ఆమోదం

ABOUT THE AUTHOR

...view details