విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనుల తీరును.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పరిశీలించారు. కూలీలకు సగటున రోజుకు 237 రూపాయలకు తగ్గకుండా కూలీ అందాలని ఆదేశించారు. పని అడిగిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని చెప్పారు. చినమేరంగలోని తన క్యాంపు కార్యాలయంలో.. జియ్యమ్మవలస మండలానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఉపాధి పనులు జరిగేచోట.. కూలీలు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎండల నుంచి రక్షణకు నీడ, మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇదివరకే గ్రామసభల్లో గుర్తించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఉపాధి కల్పనలో వివక్ష చూపించవద్దని చెప్పారు. అడిగిన వారికి పని ఇవ్వకున్నా.. సౌకర్యాలు కల్పించకున్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు.