కొవిడ్ రెండో దశ విజృంభణ వేళ... అత్యధిక సంఖ్యలో విశాఖ నగర వాసులు మహమ్మారి బారిన పడుతున్నారు. వీరిలో చాలామంది ఆసుపత్రికి వెళ్లలేక, ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. ఇళ్లలోనే ఉంటూ విపత్కర పరిస్థితుల్లో కనీసం సరైన పోషకాహారం తీసుకోలేని వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ యోగభారతి ట్రస్టు.. వాళ్ల అవసరం గుర్తించి, అలాంటి వారి ఇళ్లకు సేవకుల ద్వారా పోషకాహారాన్ని అందిస్తోంది.
యోగ భారతి ట్రస్టు వ్యవస్థాపకులు, యోగా గురువు పైడింనాయుడు తన వాలంటీర్ల ద్వారా సేవలందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా తెలిసిన వారి ద్వారా ఎవరికైతే ఆహారం అవసరమో గుర్తించి, వారి పేర్లు నమోదు చేసుకున్నారు. దాతల సహకారంతో ప్రతీరోజూ ఉదయం ఆహారం వండి ప్యాకెట్ల రూపంలో ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం స్వర్ణభారతి స్టేడియంలో అక్కడే వంట చేసి ప్యాకింగ్ చేసి హోమ్ క్వారంటైన్లో ఉంటున్న రోగులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు.