విశాఖ శ్రీ శారదాపీఠం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారతదేశంలో అద్భుత దృశ్యకావ్యంగా భావించే కుంభమేళాలో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. హరిద్వార్ వేదికగా 'మహా అన్నప్రసాద వితరణ' పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హరిద్వార్ చేరుకున్న పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి.. ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమం చేపట్టామని.. భక్తులు సద్వినియోగించుకుని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కుంభమేళాను పురస్కరించుకొని గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు హరిద్వార్ తరలివచ్చే సాధువులు, స్వాములు, అఖాడా నిర్వాహకులు, భక్తులకు విశాఖ శ్రీ శారదాపీఠం సేవలందిస్తుంది. ఉదయం పూట ఫలహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనవసతి కల్పిస్తుంది. కుంభమేళా జరిగే ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ వితరణ కార్యక్రమం కొనసాగుతుంది.