బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రహదారులు, పాఠశాలలు, ఇళ్లలోకి వాననీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం కొనసాగే అవకాశం ఉందని... మత్సకారులు వేటకు వెళ్లోద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసున్నారు.
సెలవులు ప్రకటించిన యంత్రాంగం
వర్షాల ధాటికి విశాఖ , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలన్నింటికి జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మండల అధికారులకు పలు సూచనలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చారు.
స్తంభించిన ట్రాఫిక్
పలు జిల్లాల్లో వర్షానికి రహదారులన్నీ నీటితో నిండిపోవటంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పనులు,కార్యాలయాలకు,పాఠశాలలకు వెళ్లాటానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కూలీన భవనాలు
విక్టోరియా ఆస్పత్రి సమీపంలోని ఓ పాతభవనం నేలకూలింది. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.బుచ్చయ్యపేట మండలం పెదపూడి శివారు సూర్య లక్ష్మీనగర్ వద్ద కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి. అనకాపల్లి బస్స్టాండ్ జలమయమైంది. తొట్లకొండపై ఉన్న బుద్ధ మహాస్థూపం దెబ్బతింది.
పోటెత్తిన డ్రైనేజీలు
శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా ,తూర్పు గోదావరి,కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతంలోని మురుగు కాలువలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి
ముంపునకు గురైన పంటలు
తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ వరి చేలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని మధ్య తూర్పు డెల్టాలతోపాటు మెట్ట ప్రాంతంలో వరి చేల నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. చేలు పడిపోవడంతో రైతులు మదనపడుతున్నారు.
వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆటంకం
తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి వర్షం నీరు చేరింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆలయ ప్రాంగణాలు అన్నీ నీటమునిగాయి. ప్రసుత్తం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న... నేపథ్యంలో నీరు చేరడంతో పూజలకు ఆటంకం ఏర్పడింది.
జోరు వానలు... జనజీవనం అస్తవ్యస్తం ఇవీ చదవండి
అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు