రైల్వేలలో కొవిడ్ రక్షణ చర్యలు పూర్తిస్ధాయిలో చేపడుతున్నామని వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఏప్రిల్ 15 నుంచి కొత్తగా కొన్ని రైళ్లను పునరుద్దరణ ఇప్పటికే ప్రకటించామని.. అవి యథావిధిగా ప్రారంభమవుతాయని వివరించారు. కొవిడ్ రెండో వేవ్ పతాకస్దాయికి చేరుతుండడం వల్ల మరిన్ని రైళ్ల పునరుద్దరణకు మాత్రం అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం, మాస్క్లు ధరించడం వంటివి ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామన్నారు.
వాల్తేర్ డివిజన్లో వాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేశామని...కేవలం విశాఖలోనే కాకుండా రాయగడ, విజయనగరం, శ్రీకాకుళం, కొరాపుట్లలో కూడా సిబ్బందికి టీకా ఇస్తున్నామన్నారు. ఇప్పటికే డివిజన్లో అర్హులైన వారిలో రెండు వేల మందికి ఈ వాక్సినేషన్ పూర్తయిందని...మిగిలిన వారికి పూర్తి కావడానికి మరో మూడు వారాలు వరకు పడుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి విభాగంలోనూ 50 శాతం మందితో షిప్టులలో పని చేస్తున్నామని ఆయన వివరించారు.