శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక. వీరి పెద్ద కుమార్తె సుప్రజ ఎండీ పూర్తి చేసి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్న కుమార్తె కావ్య విశాఖలో ఎంఎస్ సర్జన్ చేస్తోంది. శ్రీనివాసరావు విజయనగరంలోని రఘు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. భార్య, చిన్న కుమార్తెతో కలిసి విశాఖ ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నారు. కుమార్తె కావ్యతో కలిసి ఎంబీబీఎస్ చదువుకున్న తోటి విద్యార్థులను కలవడానికి వీరంతా కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడినుంచి చెముడులంక వెళ్లి నాలుగు రోజుల పాటు కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత వీరు ముగ్గురు కారులో విశాఖకు బయలుదేరారు. మార్గమధ్యలో భోజనం చేసి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో పులపర్తి సమీపంలోకి వచ్చేసరికి వాహనం నడుపుతున్న శ్రీనివాసరావుకు నిద్రమత్తులో రెప్ప పడటంతో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో వ్యాన్ వెనుక భాగంలోకి కారు చొచ్చుకుపోయింది.
ప్రమాదం జరిగే సమయానికి శ్రీనివాసరావు, పక్కన కూర్చున్న భార్య వెంకటలక్ష్మి సీటు బెల్ట్ ధరించలేదు. వెనుక సీటులో కూర్చున్న కుమార్తె కారు ఢీకొట్టిన తీవ్రతకు ముందు సీటులోకి దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా ఈమె మృతి చెందింది. ముందు సీటులో కూర్చున్న లక్ష్మి నేరుగా వ్యానును ఢీకొట్టడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదం జరిగే సమయానికి వ్యాన్ పూర్తిగా రోడ్డు పక్కకు ఉందని సీఐ నారాయణరావు తెలిపారు. నిద్రమత్తులో వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని సీఐ వివరించారు. వెంకటలక్ష్మి, కావ్య మృతదేహాలకు గురువారం ఎలమంచిలి ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, విశాఖ నుంచి కావ్య స్నేహితులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను గురువారం మధ్యాహ్నం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును విశాఖ ఆసుపత్రి నుంచి చెముడులంకకు తీసుకెళ్లారు.