Outer Ring Road: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారా.. అయితే ముందే జాగ్రత్త వహించండి. మరుగుదొడ్లకు వెళ్లాలనుకుంటే కష్టమే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో అగచాట్లు తప్పడం లేదు. అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వే నిర్మించామని హెచ్ఎండీఏ గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ప్రయాణికులకు కనీస వసతులు కల్పించడంలో ఏళ్లుగా మీనమేషాలు లెక్కిస్తోంది.
ఏటా 500 కోట్ల ఆదాయం:నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించి ఉంది. దీని నిర్వహణ, అభివృద్ధి పనులను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చూస్తోంది. నగరం నుంచి వెళ్లే వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కిందకు దిగేందుకు.. 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించారు. అవుటర్ ఎక్కే ప్రతి వాహనం నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. ఏటా 500 కోట్ల రూపాయలపైనే హెచ్ఎండీఏకు ఆదాయం వస్తోంది.
రోజుకి 1.4లక్షల వాహనాలు రాకపోకలు: ఓఆర్ఆర్కి ఎక్కిన తర్వాత మళ్లీ ఇంటర్‌ఛేంజ్ వద్ద కిందకు దిగాలి. ఇక్కడే వాహనదారులు, డ్రైవర్లకు మరుగుదొడ్లతో సహా ఇతర సౌకర్యాలు కల్పించాలి. కానీ కనీస వసతులు అందుబాటులో లేవు. అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. సాధారణ ప్రయాణికులకు వీటిలోకి అనుమతించడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై నిత్యం 1.4 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.