రాష్ట్రంలోని పోర్టులు, ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించిన మారిటైమ్ బోర్డుచట్టం 2018ని... అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మారిటైమ్ బోర్డు చట్టం 2019 డిసెంబరు 16 నుంచి అమల్లోకి రానుందని... పరిశ్రమలు, మౌలిక వనరుల కల్పనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ బోర్డు చట్టం ప్రకారం... ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. మారిటైమ్ బోర్డు కేంద్రంగా విశాఖను నిర్ధరిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.
డిసెంబరు 16 నుంచి అమల్లోకి మారిటైమ్ బోర్డు చట్టం
రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన మారిటైమ్ బోర్డు చట్టాన్ని... అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 డిసెంబరు 16 నుంచి మారిటైమ్ బోర్డు అమల్లోకి రానుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ కేంద్రంగా మారిటైమ్ బోర్డు ఏర్పాటు కానుంది. బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
సభ్యులు వీరే...
బోర్డు ఛైర్మన్గా ప్రభుత్వం నామినేట్ చేయనున్న వ్యక్తి నియమితులు కానున్నారు. అదే సమయంలో ఉపాధ్యక్షుడిగా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి, సభ్యులుగా మత్స్య, ఆర్థిక శాఖల కార్యదర్శులు, కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రతినిధుల్ని నియమిస్తూ నోటిఫికేషన్ జారీఅయ్యింది. రాష్ట్రంలోని ప్రైవేటు పోర్టుల ప్రతినిధులు కూడా మారిటైమ్ బోర్డు సభ్యులుగా నియమితులు కానున్నారు.
అభివృద్ధిని ఆకాంక్షిస్తూ...
మారిటైమ్ బోర్డు ఏర్పాటుతో... ఏపీ తీరం పోర్టు కార్యకలాపాలతో వర్ధిల్లుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలో... ప్రభుత్వ రంగంలో ఒక మేజర్ పోర్టు, ప్రైవేటు రంగంలో14 మైనర్ పోర్టులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులకు మారిటైమ్ బోర్డు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అనుబంధ రంగాలకు చెందిన పెట్టుబడులు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.