విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అయిదు కోట్ల ఆంధ్రులను సమీకరిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్లాంటును కాపాడుకునేందుకు కలిసి పోరాడదామంటే అధికార పార్టీ నుంచి కనీస స్పందన కరవైందని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కోసం సమైక్యంగా పోరాడేందుకు సిద్ధమని అచ్చెన్న ప్రకటించారు.
సంపూర్ణ మద్దతు...
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు అయిదో తేదీన తలపెట్టిన బంద్కు తెదేపా తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. స్టీల్ ప్లాంట్ లేకుంటే విశాఖ ఉనికికే ప్రమాదమని పేర్కొన్నారు. 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా పరిశ్రమ వల్ల ఉపాధి లభిస్తోందన్న అచ్చెన్న.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వానికి రూ.33 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పరిశ్రమ నుంచి పన్నుల రూపంలో వచ్చాయని తెలిపారు. ఇవేమీ పట్టనట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసుల మాఫీ కోసం 32 మంది ప్రాణ త్యాగాలను వాడుకుంటున్నారని ఆక్షేపించారు.