సాంకేతికతతో నేరాలను నియంత్రించేందుకు ముందుండే రాష్ట్ర పోలీసులు.. మరో కొత్తతరహా వ్యవస్థను అందిపుచ్చుకున్నారు. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఫాల్కన్ వాహనాన్ని.. సాగర నగరం విశాఖలో అందుబాటులోకి తెచ్చారు. నగరంతో పాటు జిల్లాలో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ.. ముఖ్యంగా వీఐపీల పర్యటనలు, జాతరల్లో ఈ వాహనం సేవలను అధికంగా వినియోగిస్తున్నారు. నేరస్థుల ముఖ కవళికలతో పాటు కార్యక్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పసిగట్టేందుకు ఫాల్కన్ ఉపయోగపడుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ మొబైల్ సెక్యూరిటీ వాహనం ద్వారా నేరాలు జరగకుండా నిలువరించేందు వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
నేరస్థుల పాలిట సింహస్వప్నం... ఫాల్కన్ వాహనం
వేల మంది మధ్యన నేరస్థులు ఉన్నా ఇట్టే పసిగడుతుంది ఆ వాహనం. వంద మంది పోలీసుల పనిని అదొక్కటే చేయగలదు. జేబు దొంగ నుంచి ఉగ్రవాది వరకు ఎవరైనా ఈ వాహనానికి దగ్గర్లో ఉంటే.. ఇట్టే పసిగడుతుంది. ఒళ్లంతా కెమెరా కళ్లతో పహారా కాస్తుంటుంది. రాష్ట్ర పోలీసుల వద్దనున్న ఫాల్కన్ వాహనం ప్రత్యేకతలే ఇవన్నీ.
ఫాల్కన్
ఫాల్కన్ ప్రత్యేకతలు
- పాత నేరస్థుడిని అతని ముఖ కవలికల ఆధారంగా గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తుంది
- 360 డిగ్రీల్లో కెమెరాలు ఉన్నందున ఏ చిన్న ఘటననైనా రికార్డు చేయగలవు
- నాలుగు హై రెజల్యూషన్ కెమెరాలు వీడియోలు తీసి యూనిట్‌కు పంపిస్తాయి
- ఎక్కడికైనా సులభంగా వాహనానాన్ని తరలించవచ్చు
సరికొత్త సాంకేతికతతో నేరాల నియంత్రణకు అడ్డుకట్టవేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని.. జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.