ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితులతో తన బాధను పంచుకున్న ప్రియాంక..

శ్రీకాంత్‌ అనే యువకుడు ఉన్మాదిగా వ్యవహరించి ప్రియాంక గొంతు కోయడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గత తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పూర్తిగా మాట్లాడలేకపోతోంది. స్నేహితులతో తన బాధను పంచుకుంటుంది. లేఖ రూపంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

Srikanth attack on Priyanka
Srikanth attack on Priyanka

By

Published : Dec 11, 2020, 8:33 AM IST

Updated : Dec 11, 2020, 1:11 PM IST

‘హాయ్‌ ఫ్రెండ్స్‌..అందరూ బాగున్నారా. నేను చాలా బాగున్నాను. మీరు నా కోసం బెంగపడొద్ధు మీతో చాలా మాట్లాడాలి. ఎప్పుడు ఇంటికి వచ్చేస్తానా అని ఎదురు చూస్తున్నాను. కానీ, నన్ను పంపించడం లేదు. ఇంకో ఐదు రోజుల్లో వచ్చేస్తాను. మళ్లీ మునపటిలా హుషారుగా ఉందాం. సచివాలయం మిత్రులను చాలా మిస్‌ అవుతున్నాను’అని ముత్యాల్లాంటి అక్షరాలతో ఓ లేఖ రాసిన ప్రియాంక.. ఇప్పటికీ పూర్తిగా మాట్లాడలేకపోతోంది.

ప్రియాంక రాసిన లేఖ

ఓ పథకం ప్రకారమే వచ్చాడు

శ్రీకాంత్‌ ఓ పథకం ప్రకారమే ఆ రోజు ఇంట్లోకి వచ్చాడు. లోపల ఏం జరిగిందనే విషయాన్ని ప్రియాంక ఓ పేపరుపై రాసి మాకు ఇచ్చింది. దానిని పోలీసులు తీసుకున్నారు. ఆ రోజు ప్రియాంక తప్పించుకునేందుకు ఇంటిలో ఉన్న నాలుగు గదుల్లోకి వెళ్లినా ప్రతి గదిలోను ఆమె మెడపై దాడి చేశాడు. రక్త స్రావంతో బాధ పడుతున్నా కనికరం చూపలేదు. -సూర్య కుమారి, ప్రియాంక పిన్ని

ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు

ఏ తల్లికీ ఇంతటి కష్టం రాకూడదు. మా కుటుంబం ఎంతో బాధలో ఉంది. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్‌ను మా అమ్మాయి అన్నయ్య అని పిలిచేది. ఎప్పటి నుంచో పక్కపక్కనే మా కుటుంబాలు ఉంటున్నాయి. ఇలా జరుగుతుందనుకోలేదు. ఈ తరహా దారుణాలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. న్యాయ వ్యవస్థ నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఆడ పిల్లల కుటుంబాలు ధైర్యంగా ఉంటాయి.- రమణమ్మ, ప్రియాంక తల్లి

నెల రెండో తేదీన శ్రీకాంత్‌ అనే యువకుడు ఉన్మాదిగా వ్యవహరించి ఆమె గొంతు కోయడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్వర పేటిక తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె గొంతు భాగానికి వరుసగా శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. వైద్యులు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పైపు ద్వారా మాత్రమే ఊపిరి తీసుకుంటోంది. ఆహారంగా ద్రవ పదార్థాలను పైపుల ద్వారానే అందిస్తున్నారు. థామ్సన్‌ వీధిలో వాలంటీరుగా విధులు నిర్వహిస్తూ అందరితో కలివిడి ఉన్న ప్రియాంక ప్రస్తుత పరిస్థితి తలచుకొని మిత్రులు, బంధువులు రోదిస్తున్నారు. గురువారం తనను కలవటానికి వచ్చిన తోటి వాలంటీరు మిత్రులకు తన మనసులోని బాధను, భావాలను ఓ పేపరుపై రాసి ఇచ్చింది. ప్రియాంక పరిస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా నిత్యం ఆరా తీస్తున్నారు. గురువారం ‘ఈటీవీ’తో యువతి కుటుంబీకులు మాట్లాడారు. తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'ప్రియాంక తప్పేం లేదు.. శ్రీకాంత్​ను కఠినంగా శిక్షించండి'

Last Updated : Dec 11, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details