రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి తడ దాకా సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాల్లోకి సముద్రనీరు ఇంకిపోయే సమస్య ఉంది. తీరం వరకూ నిర్మాణాలు చేసుకుంటూ పోతే... వర్షపునీరు నేలలోకి ఇంకే అవకాశం లేక... భూగర్భజలాలు సముద్రనీటితో కలసిపోతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. విపరీతమైన నగరీకరణ... సహజవనరులకు విఘాతం కలిగిస్తోందని హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి ప్రసాదించిన నీరు, నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉంది. ప్రతిచోటా జనాభా పెరుగుతున్నారు. వారికి తగ్గట్టే ఆవాసాలూ పెరుగుతున్నాయి. నీటి వాడకం పెరిగింది కానీ... వాటికి తగ్గట్లు భూగర్భజలాల సంరక్షణ పెరగలేదు. కాంక్రీట్ వనాల వల్ల భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి తగ్గిపోయింది. ఈ పరిస్థితిపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నగరవాసుల్లో చైతన్యం రాకపోతే భవిష్యత్తులో నీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విశాఖలో భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయని చెప్పారు. దీని వల్ల పలు ప్రాంతాల్లో.... బోర్ల నుంచి రంగుమారిన నీరు, ఉప్పునీరు వస్తోందని చెప్పారు. శక్తికి మించి బోర్లు వేయడం వల్ల సముద్ర నీరు క్రమేపీ ప్రవేశిస్తోందని తెలిపారు.