India skills 2021: దక్షిణ భారత నైపుణ్య పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగింది. ఐ.టి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి గౌతంరెడ్డి ఆయా పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొనగా మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ట్రాక్-2, 3 కేటగిరీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రాంగణం బయట థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు వేదిక ముందు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.
2019లో రష్యాలో జరిగిన పోటీల్లో ‘మెడలియన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ’ అవార్డు పొందిన తెలంగాణకు చెందిన కోటేశ్వరరెడ్డి కార్యక్రమానికి వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ‘అంకితభావంతో పోటీల్లో పాల్గొంటానని, మోసం చేయనని, మంచి ప్రతిభ కనబరుస్తానని, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తా’నని పోటీలకు హాజరైనవారు ప్రతిజ్ఞ చేశారు. వారికి నగరంలోని 11 కేంద్రాల్లో, 52 విభాగాల్లో పోటీలు నిర్వహించి ఈనెల నాలుగో తేదీన విజేతలకు బహుమతులు అందజేస్తారు.