భర్త నేవీ అధికారి..... తనేమో ఫ్యాషన్ డిజైనర్. రెండు చేతులా సంపాదన... సుఖమైన జీవితం. అంతటితో ఆమె సంతృప్తి చెందలేదు. అనాథ పిల్లల జీవితాల్లో సంతోషం నింపాలని.... మధు తుగ్నెట్ మదిలో మెదిలిన బలమైన కోరిక... ఇచ్ఛా సంస్థకు పురుడుపోసింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలోని... ప్రకృతి ఒడిలో పదేళ్ల క్రితం ఇచ్ఛా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటివరకూ కొనుగోలు చేసిన బంగారం అమ్మేసిన మధు తుగ్నెట్...... ఎకరానికిపైగా స్థలం కొనుగోలు చేశారు. గతంలో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఐదేళ్లు పనిచేసిన అనుభవంతో... అనాథ వికలాంగుల కష్టాలు తీరుస్తున్నారు.
పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేసిన చిన్నారులతోపాటు..... దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకురాని పిల్లలను మధు తుగ్నెట్ అక్కున చేర్చుకుంటారు. మహిళా శిశు సంక్షేమశాఖ నిబంధనలు పాటిస్తూ.. న్యాయబద్ధంగా వారిని ప్రాంగణానికి తీసుకొస్తారు. పక్షులు, కుక్కలు, పిల్లులనూ ఆమె ఆశ్రమంలో పెంచుతున్నారు. వీటితో ఆడుకోవటం చిన్నారులకు మానసిక చికిత్స వంటిదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రకృతి ఒడిలో సంతోషంగా జీవిస్తున్నామని... కరాటే, ఆటలు, పాటలు నేర్చుకుంటున్నామని చిన్నారులు చెబుతున్నారు. అనాథులైన వికలాంగులకు ప్రభుత్వం పింఛను ఇవ్వకపోవటంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపాలని కోరారు.