అమరావతి ప్రజావేదికలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని చోడవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు ఉండగా... అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పీలా గోవింద్ ఉన్నారు. ఈ స్థానాల్లో సిట్టింగ్లతో పాటు కొత్త పేర్లూ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ మూర్తి, యలమంచిలి నుంచి పంచకర్ల రమేష్‌లు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వున్నారు.
'పాయకరావుపేటకు పోటీ ఎక్కువే'
విభజన కష్టాల నుంచి తెలుగుదేశం పార్టీనే ఒడ్డున పడేయగలదని ప్రజలు గెలిపించారని... ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా, తెరాస, భాజపా కుట్రలకు ప్రజలే గుణపాఠం చెబుతారని ఉద్ఘాటించారు.
పాయకరావుపేట స్థానానికి తీవ్రపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత... పుచ్చా విజయ్‌కుమార్, చెంగల వెంకట్రావు కుమార్తెలు టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా... శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితకుమారి ఉన్నారు. విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు భరత్‌కు కేటాయించే అవకాశం ఉంది.
భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. భీమిలి నుంచి పోటీకి మంత్రి నారా లోకేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తే గంటాను విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దింపే అవకాశముంది. విశాఖపట్నం తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ... దక్షిణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్‌కుమార్ వున్నారు. విశాఖపట్నం పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గణబాబు, గాజువాక సీట్టింగ్ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు వున్నారు.