రాష్ట్ర పర్యాటక రంగంలో అతిముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటైన అరకు... మరో అదనపు ఆకర్షణ సొంతం చేసుకుంది. గ్లోబల్ ల్యాండ్ స్కేప్ హీరోస్గా ఇక్కడి కాఫీ రైతులు...విశ్వవ్యాప్త కీర్తి సాధించారు. సేంద్రీయ పద్ధతిలో కాఫీ సాగు చేస్తూ అరకు కాఫీకి ప్రత్యేక గుర్తింపు సాధించారు.
ఘుమఘుమలాడే అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు - coffe
అందమైన లోయలు, ఆహ్లాద వాతావరణంతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే సుందర ప్రదేశం అరకు. చల్లని గాలులతో ఉల్లాసాన్ని పంచే ఈ ప్రాంతం... ఘుమఘుమలాడే కమ్మని కాఫీ ఉత్పత్తి చేస్తూ భౌగోళిక గుర్తింపు సాధించింది. ఇక్కడ రైతులు గ్లోబల్ ల్యాండ్ స్కేప్ హీరోస్గా అవతరించి అరకు పర్యాటకానికి మరో కీర్తి తీసుకొచ్చారు.
విశాఖ జిల్లా అరకు రాష్ట్ర పర్యాటక రంగానికి తలమాణికం. పచ్చని ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడి కొండలోయల్లో పండించే కాఫీకి విపణిలో మంచి గిరాకీ ఉంది. భౌగోళిక గుర్తింపు సాధించిన కాఫీ రకాల్లో అరకు కాఫీ ఒకటి. సేంద్రీయ సాగులో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి రైతులు గుర్తింపు సాధించారు. పారిస్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రిక్స్ ఎపిక్యూర్-2018 పోటీల్లోనూ... ఈ కాఫీ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పుడు గ్లోబల్ ల్యాండ్ స్కేప్స్ సంస్థ నిర్వహించిన ల్యాండ్ స్కేప్ హీరోస్ పోటీలో అరకు రైతులు ప్రథమ స్థానంలో నిలిచారు. కమ్మని కాఫీని ఉత్పత్తి చేస్తూ... అరకు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు ఈ మన్యం వీరులు.
విశాఖ ఏజెన్సీలో ఏటా 10వేల 500 టన్నుల కాఫీ ఉత్పత్తవుతోంది. ఐటీడీఏ సహకారంతో 40వేల మంది రైతులు ఇక్కడ కాఫీ ఉత్పత్తి చేస్తున్నారు. నాంది అనే సంస్థ అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండింగ్‌లో నిలిపేందుకు దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. వివిధ దేశాల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తూ వారికి మన కాఫీ రుచి చూపెడుతోంది. ల్యాండ్ స్కేప్ హీరోస్గా అవతరించి మన్యం రైతులు.... ఈ సంస్థ కల నిజం చేసి చూపించారు.