ఏసీబీ, సీఐడీ, పోలీసు శాఖలు తాము స్వతంత్ర సంస్థలమన్నది మరిచిపోయి ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతున్నాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చి.. ప్రజాభిమానంతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఏసీబీ వాళ్లు తెల్లవారుజామున ఇంటికెళ్లి అరెస్టు చేయడం దారుణాతి దారుణమని శనివారం ఒక వీడియో సందేశంలో ధ్వజమెత్తారు. ‘సంగం డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చడం తప్పయితే.. విశాఖ డెయిరీని మార్చడం తప్పు కాదా? సంగం డెయిరీ కంటే ముందే కంపెనీ చట్టంలోకి మార్చిన విశాఖ డెయిరీ నిర్వాహకులపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైకాపాలో ఉన్నందున వాళ్లపైకి ఏసీబీని పంపలేదా? వైకాపా వాళ్లయితే ఏం చేసినా పర్వాలేదా? లేకపోతే పార్టీలోకి వచ్చేటప్పుడు కోట్లాది రూపాయల కప్పం కట్టినందున సీఎం వాళ్ల జోలికెళ్లడం లేదా?’ అని ప్రశ్నించారు.
విశాఖ డెయిరీపై చర్య తీసుకుంటారా?
‘విశాఖ డెయిరీపై మేం కూడా ఫిర్యాదు చేస్తాం. ఏసీబీ చర్య తీసుకుంటుందా? లేదా సీఎం అనుమతి కోసం నిరీక్షిస్తుందా?’ అని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పోలీసు శాఖ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏపీ పోలీస్ అంటే దేశమంతా అసహ్యించుకుంటోంది. ఒక నాయకుడు చెప్పినట్టు నడుచుకుంటూ తిరుపతిలో దొంగ ఓటర్లను అరెస్టు చేయకుండా వదిలేశారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఏసీబీ, సీఐడీ స్వతంత్ర సంస్థలని వాటి అధిపతులు గుర్తిస్తే మంచిది. ఎవరు తప్పుచేసినా అరెస్టు చేయండి. దానికి ముందు ఆధారాలతో నిరూపించండి. నాయకుల ఒత్తిడితో పనిచేయకండి. ఎవరినైనా జైల్లో వేయించి అద్దంలో చూసుకొని నవ్వుకోవడం ఈ ముఖ్యమంత్రికి అలవాటు. ఆ విషయాన్ని ఏసీబీ, సీఐడీ అధికారులు గ్రహించాలి’ అని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.
ఉచిత సేవలందించడమూ తప్పేనా?
‘సంగం డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చడం నరేంద్ర చేసిన తప్పని ప్రభుత్వం ఆరోపిస్తోంది. డెయిరీ తరఫున ట్రస్టు ఏర్పాటుచేసి ఆసుపత్రి నిర్మించి పేదలకు, మధ్యతరగతికి ఉచితంగా.. నాణ్యమైన వైద్య సేవలందించడానికి ఆయన ప్రయత్నించడం కూడా తప్పేనంటోంది. పక్క రాష్ట్రంలోని నల్గొండలో ఒక డెయిరీని, విశాఖ డెయిరీని సంగం డెయిరీకంటే ముందే కంపెనీ చట్టంలోకి మార్చారు. ఒక వేళ అది తప్పయితే... విశాఖ డెయిరీ యాజమాన్యంపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర చేసినప్పుడు విశాఖ డెయిరీ వాళ్లే అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి చర్యలు తీసుకోవడం లేదా?’ అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ‘నరేంద్ర వంటి పెద్ద నాయకులను అరెస్టు చేసే ముందు తగిన ఆధారాలు చూపించి నోటీసులిచ్చి చర్యలకు ఉపక్రమించాలి. అవన్నీ ఎందుకు చేయలేదు? ఏమిటీ దారుణం? రాత్రికి రాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్టు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? ఏసీబీ వాళ్లకు నిజంగా మానవత్వం, విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి ఉంటే విశాఖ డెయిరీ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.