ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మన్యంలో మారని పరిస్థితులు... ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే దిక్కు

By

Published : Aug 8, 2020, 1:06 PM IST

మన్యంలో గర్భిణిలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరక యాతన పడుతున్నారు. పురిటి నొప్పులు వస్తే గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిందే. హుకుంపేట మండలంలో ఓ గర్భిణిని కిలో మీటర్ల మేర డోలీలో మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రహదారులు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని మన్యం వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

doli problems
doli problems

విశాఖ మన్యం మారుమూల కొండ ప్రాంతాల్లో డోలి మోత ఆగడం లేదు. గత ప్రభుత్వం హయాములో కొండ ప్రాంతాల్లో రహదారులు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. చాలా రహదారులు మట్టి స్థాయిలోనే పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కొండ ప్రాంతాల్లో గిరిజనులు మండల ప్రాంతాలు చేరుకునేందుకు చాలా అవస్థలు పడుతున్నారు.

హుకుంపేట మండలం తీగల వలస పంచాయితీ పనస బంద నుంచి గర్భిణి బుల్లెమ్మ(25)ను కిలోమీటర్ల మేర డోలీ మోసి రహదారికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి గర్భిణిని హుకుంపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మన్యం ప్రాంతాల్లోని చాలా కొండ గ్రామాల్లో రహదారులు ఇలా మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేక.. డోలి మోత తప్పడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి బిల్లులు చెల్లించి నిర్మాణాలు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. తమకు ఈ డోలి కష్టాలు తీర్చమని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details