విశాఖ మన్యం పాడేరు మండలంలో శివారు కొండల్లో గిరిజన రైతులు ఉద్యానపంటలు సాగుచేస్తుంటారు. వారు ఎక్కువగా అనాస, పనస, మామిడి, నిమ్మ, బత్తాయి, నారింజ పండిస్తారు. వీటి ద్వారానే ఆదాయం పొందుతూ కుటుంబాలను పోషించుకుంటారు. పంట చేతికొచ్చే సమయానికి కరోనా లాక్డౌన్ విధించటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఉద్యాన పంటలపై కరోనా పిడుగు... ధర లేక రైతు దిగాలు ! - corona effect on farmers
ఉద్యాన పంటలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించటంతో పండిన పంటలు అమ్ముడుపోకపోగా... గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. పెట్టుబడులు రాగా తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విశాఖ మన్యంలోని ఉద్యాన రైతులు కోరుతున్నారు.
మార్కెట్ సదుపాయం లేక చింతపండును రైతులు చెట్లకే వదిలేశారు. తద్వారా లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాస, పనస పంటలను వాహనాల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించాలని చూసినా..లాక్డౌన్ నిబంధనల పేరిట పోలీసులు తిప్పి పంపారని పంటలు అమ్ముకోలేక, ఇళ్లకు తీసుకురాలేక ఎంతోకొంతకు అమ్ముకున్నామని రైతులు తెలిపారు.
పంటలను సమీప సంతలకు చేర్చాలన్న ఛార్జీలు ఎక్కువగా అవుతున్నాయిని.. విధిలేక పండిన పంటలను చెట్లపైనే వదిలేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు గ్రామాలకు వెళ్లి ఉద్యాన పంటల కొనుగోలు చేసేలా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వారు ప్రోత్సహించి ఉద్యాన రైతు లను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు