Presidential fleet review: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు నౌకల బలం, బలగాన్ని సమీక్షిస్తూ ఉంటాయి. ఈ సమీక్ష ద్వారా ప్రస్తుత పరిస్థితులకు నౌకాదళం ఏ మేరకు సన్నద్ధంగా ఉందనేది అంచనా వేసుకుంటాయి. దేశ మెరైన్ అవసరాలకు అనుగుణంగా, సార్వభౌమత్వ పరిరక్షణకు, సముద్ర మార్గాల ద్వారా నౌకల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవ్వాలనేది బేరీజు వేసుకునేందుకు.. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఒక కొలమానంగా ఉంటుంది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మన సత్తా చాటి చెప్పటం వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
దేశంలోనే మొదటి ఫ్లీట్ రివ్యూ
18వ శతాబ్దంలో జరిగిన మరాఠా ఫ్లీట్ రివ్యూ.. దేశంలోనే తొలి ఫ్లీట్ రివ్యూగా నమోదైంది. సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ చేసే సంప్రదాయం మన దేశంలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటివరకు భారత నౌకాదళం ఆధ్వర్యంలో 11 ఫ్లీట్ రివ్యూలు జరగ్గా.. అందులో రెండు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు. ఐఎఫ్ఆర్(IFR)గా వ్యవహరించే ఈ తరహా రివ్యూలు.. 2001లో ముంబైలో, 2016లో విశాఖలో నిర్వహించారు. ఫ్లీట్ రివ్యూకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ముఖ్యమైన పరేడ్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఫ్లీట్ రివ్యూలో భాగంగా యాంకరేజి చేసిన నౌకలను రాష్ట్రపతి పరిశీలిస్తారని తూర్పు నౌకాదళం అధికారి సంజయ్ భల్లా తెలిపారు.
రాష్ట్రపతి పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ
దేశ నౌకదళ బలాన్ని సమీక్షించే కార్యక్రమం రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ. సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన యుద్ధనౌక నుంచి నాలుగు వరసల్లో మోహరించిన 44 నౌకలని పరిశీలిస్తారు. ఇది విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మూడో ఫ్లీట్ రివ్యూ. చివరగా 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈసారి ప్లీట్ రివ్యూ ప్రత్యేకమైనది.