తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని గిరిజన బాలబాలికలు ఆదివారం వినూతన్నంగా చేతులు జోడించి వేడుకున్నారు. విశాఖ జిల్లా జి మాడుగుల, రావికమతం మండల సరిహద్దులో నేరేడు బండ అనే కుగ్రామం ఉంది. ఇక్కడ పాతిక లోపు కుటుంబాలు ఉన్నాయి. మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవటంతో.. ఇక్కడ జన్మించిన 18మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు. వీరు ఆసుపత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవటంతో వీరికి బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఆధార్‌కార్డు సమస్యగా మారింది. మండలంలో గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలూరు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తూ చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డులు లేవు. దీంతో విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం.. జిల్లా కలెక్టర్ సారు.. దయ చేసి మాకు ఆధార్ కార్డులు ఇప్పించండి. మేము చదువుకొనికి బడికి పోతాం అంటూ గిరిజన బిడ్డలు వేడుకున్నారు.
Tribal children: రికార్డుల్లో లేని గ్రామం.. అందని ధ్రువీకరణ పత్రాలు... - Aadhaar issues in Visakhapatnam agency
ఓ గిరిజన గ్రామం అధికారుల పద్దుల్లో లేకుండా పోయింది. దీంతో ఆ ఊరిలో పుట్టిన ఏ చిన్నారికి.. ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు లాంటివి లేవు. దగ్గరలోని బడికి వెళితే.. ఆధార్ తెస్తేనే అడ్మిషన్ అన్నారు అక్కడి యాజమాన్యం. పాపం చదువుకోవాలని కొండంత ఆశతో వెళ్లిన ఆ చిన్నారులకి నిరాశే ఎదురైంది. చివరికి 'మాకు ఆధార్ ఇప్పించండి.. మేము చదువుకుంటాం' అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఏజెన్సీలో చిన్నారుల ఆధార్ సమస్యలు