గుంటూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతమైన నిజాంపట్నం పరిసరాల్లోని పేకాట శిబిరంపై రెండు రోజుల కిందట స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) బృందం, పోలీసులు మెరుపుదాడి చేసి.. పెద్దసంఖ్యలో జూదరులను అరెస్టు చేసింది. వారి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. వారికి చెందిన ఖరీదైన వాహనాలను సీజ్ చేసింది. ఈ పరిణామంతో శిబిరం నిర్వాహకులకు కాళ్లు, చేతులు ఆడటం లేదు. ఇంతకీ ఆ శిబిరం నిర్వాహకులు ఎవరు? వెనుక ఉండి సహకరిస్తున్న నేతలు ఎవరు అనే కోణంలో ప్రస్తుతం సెబ్ అధికారులు దర్యాప్తు చేపట్టనుండటంతో శిబిరం నిర్వాహకుల వెన్నులో వణుకుపుడుతోంది.
ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అసలే సెబ్ అధికారులు కావడంతో వారిపై ఒత్తిడి తేలేక.. పట్టుబడిన వారికి ఏం చెప్పాలో తెలియక ఆ నేత ప్రస్తుతం సతమతమవుతున్నారు. మొత్తంగా సెబ్ మెరుపుదాడితో తన అడ్డాలో పేకాట శిబిరం బాగోతం బయటపడటంతో తనకు రాజకీయంగా ఎక్కడ చెక్ పడుతుందోనని ఆ నేత ఆందోళనతో ఉన్నట్లు వినికిడి. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కార్యకలాపాల్లో భాగస్వాములు కావొద్దని, పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలోనే హెచ్చరించిన ఉదంతాలు లేకపోలేదని తాజాగా అది పునరావృతం కావడం.. అదీ కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో పోలీసులకు చిక్కడంతో ఇది కచ్చితంగా ప్రభుత్వంపై ప్రభావం చూపే అంశం కావడంతో ఉన్నత స్థాయిలో ఈ వ్యవహారం పెద్ద రచ్చయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
అంత దూరం ఎవరు వెళతారు?
తీర ప్రాంతంలోని మారుమూల ప్రాంతానికి వెళ్లేందుకు ఏ మాత్రం రవాణా సౌకర్యం లేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఖరీదైన వాహనాల్లో ఇక్కడకు వచ్చి పేకాట ఆడుతున్నారంటే వారికి అభయమిచ్చే నేతలు లేకపోతే ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్లగలరా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తన అడ్డాలోకి తనకు తెలియకుండా ఎవరు అడుగు పెట్టే ప్రసక్తి లేదని, ఎవరైనా వచ్చినా తాను చూసుకుంటానని భరోసా కల్పించడం వల్లే రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు, చీరాల, భీమవరం, ఏలూరుతో పాటు పొరుగు రాష్ట్రం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రూ.లక్షల్లో పేకాట ఆడటంతో పాటు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని పోలీసుల పరిశీలనలో తేలింది. శిబిరం నిర్వాహకులకు రోజుకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడి లేకుండా సులువైన సంపాదన కావడంతో ఆ నేత ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారని వినికిడి.
ఇంతకు ముందే ఆ ప్రాంతంలో పేకాట యథేచ్ఛగా జరుగుతోందని అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చింది. అయినా దాన్ని కొనసాగించటం గమనార్హం. అసెంబ్లీలో చర్చకు రావడంతో గతంలో ఒకసారి ఆ శిబిరంపై సెబ్ అధికారులే దాడులకు ప్రణాళిక రూపొందించారు. అయితే అప్పట్లో ఆ విషయం నిర్వాహకులకు లీకు కావడంతో తప్పించుకున్నారు. ఎవరి ద్వారా సమాచారం లీకవుతుందో తెలుసుకున్న సెబ్ బృందం ఈసారి వారికి తెలియనీయకుండా పకడ్బందీగా దాడికి ప్రణాళిక రచించి ఆమేరకు సఫలీకృతమైంది. నేరుగా విజయవాడ నుంచే సెబ్ బృందాన్ని నిర్వాహక ప్రదేశానికి పంపింది. దాడికి ప్రణాళిక రూపొందించిన విషయం గుంటూరు జిల్లాకు చెందిన ఒక అధికారికి మాత్రమే సమాచారమిచ్చి ఆయన బృందాన్ని అక్కడకు చేరుకోవాలని సూచించి మరోవైపు విజయవాడ బృందాన్ని నేరుగా పేకాట శిబిరం ప్రదేశానికి చేరుకునేలా సెబ్ డైరెక్టరేట్ అధికారులు క్రియశీలకంగా వ్యవహరించారని సమాచారం.