YSRCP Reddy Leaders Discrimination on Dalith MLAs :"వైఎస్సార్సీపీ రెడ్ల పార్టీ" అని నేను అన్న మాట కాదండీ బాబు సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్న మాటలు. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. వారి వ్యాఖ్యలను నిజం చేసే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల తీరు ఉంది.
మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కిన దళిత ఎమ్మెల్యే ఆదిమూలం :తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రిని కలిసినట్లు బయటకు చెబుతున్నా, అంతర్గతంగా రానున్న ఎన్నికల్లో సీటు విషయమై అడిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మంత్రి చెప్పినట్లుగానే చేసినట్లు ఇటీవల వైఎస్సార్సీపీ పెద్దల వద్ద ఎమ్మెల్యే తన ఆవేదనను తెలియ జేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన మంత్రిని కలిసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
దళితులంటే చిన్న చూపు - సీఎం జగన్పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు
దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా :ఇప్పటికే "దళిత ఎమ్మెల్యేలు అంటే జగన్కు చిన్న చూపా, దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా. పాపమా అదే మా కర్మా" అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇటీవలే బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో దళిత ఎమ్మెల్యే మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.