ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరాంధ్ర 2019... సిక్కోలు ఎవరికి చిక్కేను...!?

జాతీయ స్థాయి రాజకీయ ఉద్దండులను అందించిన ఆ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. సర్దార్ గౌతులచ్చన్న నుంచి కింజరాపు ఎర్నన్న వరకూ ఎందరో మహానుభావులను అందించిన నేల అది. ఈ ఎన్నికల్లోనూ రాజకీయ రణాలు... కులాల కుంపట్లు... ఇంటిపోర్లు.. ఇలా శ్రీకాకుళం సమరంలో చెప్పుకోగదగ్గ అంశాలెన్నో..!

సిక్కోలు ఎవరికి చిక్కేను...!?

By

Published : Apr 2, 2019, 6:34 PM IST

Updated : May 31, 2019, 3:20 PM IST

సిక్కోలు ఎవరికి చిక్కేను...!?

సువిశాల సముద్ర తీరం... ఖనిజాలకు నిలయం... కళింగాంధ్ర సంస్కృతికి పెట్టింది పేరు... పలాస జీడిపప్పు.. నాగావళి, వంశధార నదుల కలయిక శ్రీకాకుళం. ప్రజా ఉద్యమాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం. ఇవన్నీగొప్పగా చెప్పుకునే విషయాలైతే... తరచుగా తుపానులు, ఉద్దానం మూత్రపిండాల సమస్య.. వలసపోయే ప్రజలు... ఇవన్నీదీనంగా చెప్పే బాధలు. ఇలాంటి జిల్లాలో సార్వత్రిక సమరం.. అనేక అంశాలను ప్రజల అజెండాగా మలుస్తోంది. మరి వారి బాధలను వినే పార్టీ ఏది.. పట్టించుకునే నేతలెవరు.. గెలిచి నిలిచేదెవరు... ఇవన్నీ కూడా శ్రీకాకుళం పోరులో ముఖ్యాంశాలే.

సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళి, తమ్మినేని సీతారాం వంటి ప్రముఖులు.. ప్రధాన పార్టీల నుంచిపోటీలో ఉన్నారు. సిక్కోలు జిల్లాలోమొత్తం 10 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 7 స్థానాలను, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గాన్ని తెదేపా కైవసం చేసుకుంది. వైకాపా 3 స్థానాలకే పరిమితమైంది.

చంద్రబాబు ప్రభుత్వ పథకాలపై జిల్లా ప్రజలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుండగా... వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా మధ్య కొద్దిపాటి వ్యత్యాసమే కనిపించింది. ఒక మండలంలో ఓ పార్టీకి కాస్త ఎక్కువ ఆధిక్యం కనిపిస్తే.. మరో మండలంలో మరో పార్టీ పట్టు చూపుతోంది. తెదేపా పట్ల పలు ప్రాంతాల్లో సంతృప్తి వ్యక్తం అవుతుండగా కొన్ని మండలాల్లో మాత్రం వైకాపా వైపు గాలి వీస్తున్నట్టు అర్థమవుతోంది. కొన్ని స్థానాల్లో జనసేన ఓట్ల చీలికతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది.

గెలిచి నిలిచేదెవరు..?

ఇచ్చాపురం ఆది నుంచి తెదేపాకు కంచుకోట. తిత్లీ తుపాను అనంతర చర్యలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతోంది. బెందాళం అశోక్ తెదేపా నుంచి పోటీలో ఉన్నారు. గతంలో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పిరియా సాయిరాజ్‌ ఇప్పుడు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైకాపా అభ్యర్థికి నియోజకవర్గంలో సన్నిహిత సంబంధాలు ఉండటం కలిసొచ్చే అంశం.

తెదేపా సీనియర్‌ నాయకుడు గౌతు శ్యాంసుందర్‌ కుమార్తె శిరీష తొలిసారి పలాస నుంచి బరిలో నిలిచారు. వైకాపా నుంచి జాలరి సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజు పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు భార్య ధనలక్ష్మి తెదేపాలో చేరడం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు హరిప్రసాద్‌ వైకాపాలో చేరడం రాజకీయాలను మలుపుతిప్పనుంది జనసేన తరఫున పలాస మున్సిపల్‌ ఛైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు పోటీ చేస్తున్నారు.

మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి కృషితో టెక్కలి స్వరూపమే మారిపోయిందని స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఊరిలో ఉన్న సమయంలో రోజుకు కనీసం 2 వేల మందిని కలుస్తారనే పేరుంది. పనులు చేసే తత్వం ఉన్నా... ఆత్మీయత ఉండదనే విమర్శ ఉంది. ఎర్రన్నాయుడి సోదరుడిగా ఉన్న ఇమేజి కలిసొచ్చే అంశం. వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్‌... కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత... ఆయన పలు వర్గాల మద్దతు కూడగట్టుకొని గట్టిపోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వైకాపాకు పట్టున్న గ్రామాలున్నాయి. జనసేన నుంచి కణితి కిరణ్​కుమార్ పోటీలో ఉన్నారు.

నర్సన్నపేటలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న బగ్గు రమణమూర్తి, ధర్మాన కృష్ణదాస్ ఒకే ఊరికి చెందిన వారు.. కృష్ణదాస్‌కు ఇక్కడ స్వతహాగా మంచి పేరుంది. కానీ... ఆయన కుటుంబానికే చెందిన లక్ష్మణదాస్‌ తెదేపాలో చేరిన ప్రభావం.. విజయావకాశాలపై పడుతుందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. ఐనా ఇద్దరి మధ్య నువ్వా... నేనా అన్నట్లు పోటీ ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ జనసేన తరఫున మెట్ట వైకుంఠం పోటీ చేస్తున్నారు.

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ధర్మాన, లక్ష్మీదేవమ్మ పోటీ పడుతున్నారు. వ్యాపారులపై కేసులు, ధర్మాన, ఆయన కుమారుడి ప్రవర్తన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. తెదేపా ఎమ్మెల్యే లక్ష్మీదేవి సౌమ్యురాలనే పేరున్నా.. క్యాడర్‌కు ఇబ్బందులు తలెత్తినప్పుడు జోక్యం చేసుకోరనే అపవాదు ఉంది. ఆమె మద్దతుదారుల్లో అసంతృప్తి ఉంది. జనసేన తరఫున కోరాడ సర్వేశ్వరరావు పోటీ చేస్తున్నారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు.. మంత్రి కళావెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నుంచి ఆయనపై పోటీగా గొర్లె కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. కళా.. అందుబాటులో ఉండటం లేదనే విమర్శ ఉంది. సౌమ్యుడనే పేరు కలిసొచ్చే అంశం. కొన్ని మండలాల్లో పోటాపోటీగా ఉన్నా... లావేరు వంటి చోట తెదేపాకు గట్టెక్కిస్తుందని అంచనా శ్రేణుల్లో ఉంది. గొర్లె కిరణ్‌కుమార్‌ వ్యవహార శైలిపైనా విమర్శలున్నాయి.

బావా- బావమరుదుల పోరు.. నెలకొన్న ఆముదాల వలసలో ప్రజలు ఎవరివైపున్నారో అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వ విప్ కూనరవికుమార్- మాజీమంత్రి సీతారాం మధ్య హోరాహోరీ పోరు నెలకొని ఉంది. అభివృద్ధి పనులు, 2 ఎత్తిపోతల పథకాలు చేపట్టడం కూనకు కలిసొచ్చే అంశాలు కాగా... పొందూరు మండలంలో రవికుమార్​పై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి చెందిన కోట గోవిందరావు వైకాపాలో చేరడం కొంత ప్రభావం చూపొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆముదాలవలస చక్కెర ఫ్యాక్టరీ కోసం పోరాడిన చింతాడ రవికుమార్‌ వైకాపాలో చేరడమూ కూనకు ఇబ్బందే. ప్రభుత్వంపై వ్యతిరేకత తనకు కలిసోస్తుందని తమ్మినేని ధీమాగా ఉన్నారు.

రాజాం నుంచి తెదేపా తరపున బరిలో దిగుతున్న కొండ్రు మురళీ... కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులే కలిసొస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తెదేపా నాయకుల్లో అనైక్యత వరం కానుందని ప్రతిపక్షం అంచనావేస్తోంది. వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే జోగులుకు సౌమ్యుడని పేరున్నా... ఈ అయిదేళ్లుగా ఆశించిన అభివృద్ధి చేయలేదనే విమర్శ ఉంది. జనసేన కూటమి నుంచి ముచ్చా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం పాలకొండలో తెలుగుదేశం నుంచి జయకృష్ణ బరిలో ఉన్నారు. పార్టీలో వర్గ విభేదాలు తొలగించుకుని ప్రచారంలో ముందున్నారు. ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. వైకాపా అభ్యర్థి కళావతికి సౌమ్యురాలిగా పేరుంది. తెదేపాపై వ్యతిరేకత కలిసొస్తుందన్న ధీమాతో ఉన్నారు. జనసేన కూటమి తరఫున డా.జీవీజీ శంకరరావు పోటీలో ఉన్నారు.

పాతపట్నంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ప్రభావం కీలకాంశం అవుతోంది. నిర్వాసితులకు పింఛన్లు ఇస్తామని మంత్రి లోకేశ్‌ తాజాగా హామీ ఇచ్చారు. జనంతో మమేకమవ్వరనే విమర్శ ప్రస్తుత ఎమ్మెల్యే కలమట వెంకటరమణపై ఉంది. రెండు మండలాల్లో బలముందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతికి అండగా స్థానిక నేతలు ఎంత బలంగా నిలబడతారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారామె. మరి ప్రజలు ఎవరిని ఆమోదిస్తారో మే 23న తేలనుంది.

Last Updated : May 31, 2019, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details