ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయసాయిరెడ్డిపై ఐపీఎస్‌ అధికారి న్యాయపోరాటం - వెంకటరత్నం

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై గట్టిగా బదులిచ్చిన ఐపీఎస్‌ అధికారి వెంకటరత్నం... న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వైకాపా నేతలపై కేసులు పెట్టారు.

ఐపీఎస్‌ అధికారి వెంకటరత్నం

By

Published : Mar 28, 2019, 12:05 AM IST

Updated : Mar 28, 2019, 10:40 AM IST

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అడ్డాల వెంకటరత్నం... తనపై చేసిన ఆరోపణలు నిరుపించాలని పట్టుబడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రధానాధికారికి లేఖాస్త్రం సందించిన ఆయన... తప్పుడు ఆరోపణలు చేశారని వైకాపా నేత విజయసాయిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు.

తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే
రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై వివాదం ఇంకా ముదురుతోంది. ఈసీ ఆదేశాల మేరకు బదిలీ అయిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అడ్డాల వెంకటరత్నం తనపై చేసిన ఆరోపణలు నిరాధారమంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. దోషిగా తేలితే తాను ఎలాంటి శిక్షకైనా సిద్దమని లేఖలో ప్రకటించారు. నిరాధారమైన ఆరోపణలతో తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని... 30 ఏళ్ల సర్వీసులో ఏనాడు తప్పు చేయలేదని పేర్కోన్నారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి తనపై చేసిన నిరాధారమైన ఆరోపణల కారణంగా తన ఆత్మగౌరవానికి , ఆత్మ విశ్వాసానికి భంగం కలిగిందన్నారు. వైకాపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్న మార్చి 18 తేదీన తాను పూర్తిగా కార్యాలయానికే పరిమితమై రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత అంశాలపై అధికారులతో సమావేశమయ్యానని చెప్పుకొచ్చారు. వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని కొట్టిపారేశారు. వైకాపా నేతలు ఫిర్యాదు చేసిన 24 గంటలు గడువక ముందే ఈసీ తనను బదిలీ చేస్తూ చర్యలు చేపట్టిందని.. ఇదే వేగంతో తన లేఖపైనా స్పందించాలని ఆయన కోరారు. దోషిగా తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.
విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు

వైకాపా నేతలు చేసిన ఆరోపణలపై ఏ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించిన ఐపీఎస్ అధికారి ఏ వెంకటరత్నం తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సెక్షన్ 182 కింద కేసు రిజిస్టర్ అయ్యిందని అన్నారు. తప్పుడు ఆరోపణలపై సివిల్ , క్రిమినల్ చర్యలకు సిద్దమని అన్నారు. అన్నట్టుగానే టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Last Updated : Mar 28, 2019, 10:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details