గ్రామ సచివాలయం, ఏపీఎండీసీల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ప్రక్రియను అప్పజెప్పింది ప్రభుత్వం. ఎవరికైనా కావాలంటే వార్డు, గ్రామ సచివాలయాలకు వెళ్లి ముందుగా బుక్ చేసుకోవాలి. యూనిట్ ఇసుక 375 రూపాయాలు చెల్లించాలి. రేవు నుంచి స్టాక్‌యార్టు, అక్కడి నుంచి కోరుకున్న చోటుకయ్యే ఖర్చు అదనం. బుక్ చేసే సమయానికి ఏ నిల్వ కేంద్రంలో అందుబాటులో ఉంటుందో అక్కడి నుంచి బుక్ అవుతోంది. ఒకవేళ కేంద్రం దూరంగా ఉంటే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. అయినా కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
తడిసి మోపెడు..
నిజానికి ఇసుక ధర కంటే అదనపు ఖర్చులే వినియోగదారుడికి అధికం అవుతున్నాయి. కొన్నిచోట్ల అదనపు ఖర్చు రెండింతలవుతోంది. ఇటీవల ఇళ్లు, ఇతర నిర్మాణాలు, ప్రభుత్వ భవనాలు, ఉపాధి పనుల కట్టడాలు ఒకసారి ఊపందుకోవడంతో కొన్నిచోట్ల ఇసుక కొరత ఏర్పడింది. వినియోగదారులకు దగ్గరలో ఉన్న స్టాక్‌యార్డులో లేకుంటే వేరేచోట నుంచి ఇస్తున్నారు. ఫలి తంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీనికితోడు కొత్త ఛార్జీలు మరింత భారంగా పరిణమిస్తున్నాయి. అయినా సరఫరాలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో భవన నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు.
అదనంగా రూ.2 వేలు చెల్లిస్తేనే...
ఇసుక కోసం ప్రక్రియ అంతా పూర్తిచేయడం కష్టమనుకుంటే అది ఇంటికి ఎప్పుడొస్తుందో చెప్పడం మరీ కష్టం. బుకింగ్ సమయంలో రవాణా కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు తాము సరఫరా చేయలేమని కొందరు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. దానికి అదనంగా రూ.2 వేలు చెల్లిస్తేనే డెలివరీ చేస్తామని తెగేసి చెప్పేస్తున్నారు. ఆ ప్రకారం చెల్లించిన వారికి అనుకున్న దానికంటే ముందే ఇంటికొచ్చేస్తోంది. ఇవ్వని వారికి మాత్రం జాప్యం చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.
అవగాహన లేమి, సాంకేతిక సమస్యలు..
నూతన ఇసుక విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. స్వయంగా ఆన్‌లైన్‌లో ఇంటి నుంచి ఇసుక బుక్ చేసుకోవాలంటే అన్ని సందర్భాల్లోనూ కుదరడం లేదు. సాంకేతికత గురించి తెలియని వారు పడే ఇబ్బందులు వేరే చెప్పనక్కరలేదు. తప్పక గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికీ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది తమకు అవగాహన లేదని తిప్పి పంపించడం గమనార్హం. మరి కొందరు సాంకేతిక సమస్యల సాకుతో రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇసుక దొరకక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరో గత్యంతరం లేక బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.