Super Specialty Hospital for Kidney Patients at Palasa: శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు.. ఈ ఏడు మండలాలను ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతం కొబ్బరి, జీడి, మామిడి, పనస, మునగ తోటలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ అక్కడ వాతావరణం ఉన్నంత ప్రశాంతంగా మనుషులు లేరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు వేలల్లో ఉన్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గంలో సుమారు 10 వేలకు పైగా.. కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు అంచనా.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతున్నా.. నివారణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. బాధితులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. 2019 సెప్టెంబర్ 6 న కిడ్నీ రోగుల కోసం 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు పరిశోధన కేంద్రానికి పలాస వద్ద శంకుస్థాపన చేశారు.
దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా.. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. 50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు.. ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. 3 నెలల కిందట కిడ్నీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి విడదల రజిని.. 2023 మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ మాటలూ నీటిమీద మూటలుగానే మిగిలిపోయాయి.
ఉద్దానం ప్రాంతంలో దాదాపు వెయ్యికి పైగా.. డయాలసిస్ కిడ్నీ రోగులు ఉన్నట్టు అంచనా. వీరు వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. దీనికోసం కుటుంబ సభ్యులతో ప్రత్యేక వాహనంతో శ్రీకాకుళం, పలాస, హరిపురం, టెక్కలి, పాలకొండ , కవిటి ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి రావాలి. వాహనాలు, మందుల ఖర్చులకు.. నెలకు వేలల్లోనే ఖర్చు అవుతుంది.