అమరావతి రైతులను తెదేపా అధినేత చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. అమరావతి ఉద్యమాన్ని పెయిడ్ ఆర్టిస్టులతో నడిపిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని దేశవానిపేట గ్రామంలో సచివాలయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ తెదేపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక సమయంలో పరుష పదజాలంతో మాట్లాడారు.
చంద్రబాబు ఎన్నికలకు వెళ్తే... పోటీకి నేను సిద్ధం: ధర్మాన - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అమరావతి ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. అలాగే తెదేపా అధినేత ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
మూడు రాజధానులతో వచ్చే నష్టం ఏంటో తెదేపా నేతలు చెప్పండి. ఆ పార్టీ నుంచి ఎవరు ఎన్నికలకు వచ్చినా... వారిపై పోటీకి నేను సిద్ధం. రామ్మోహన్ నాయుడైనా, అచ్చెన్నాయుడైనా.. చివరకి చంద్రబాబుతోనైనా పోటీకి నేను సిద్ధం. విశాఖలో రాజధాని వద్దూ... అమరావతిలోనే రాజధాని ఉండాలి అన్న నినాదంతో తెదేపా నేతలు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలి. ఉత్తరాంధ్ర నుంచి నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. నా సవాల్ స్వీకరిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను- ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి