మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) అమలులో 2018-19 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ఈ పథకం అమలును ప్రతి ఏటా విశ్లేషించి రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అవార్డులను ప్రకటిస్తున్న విషయం విదితమే. పారదర్శకత, జవాబుదారీతనం, కొత్త ఆవిష్కరణ విభాగాల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచి రెండు అవార్డులకు ఎంపికైంది. పనుల నిర్వహణ, భౌగోళిక సమాచార వ్యవస్థ(జీపీఎస్) అమలులో కడప జిల్లా బద్వేలు బ్లాకుకు చెందిన నరేగా ఉద్యోగి ఏకే రామకృష్ణా రెడ్డి మొదటి ర్యాంకులో నిలిచి అవార్డుకి ఎంపికయ్యారు. అలాగే ప్రభావవంతంగా పథకం అమలు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు తృతీయ స్థానం దక్కింది. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలో ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న 660 జిల్లాల్లో అత్యంత సమర్ధవంతంగా అమలు చేసిన 18 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో శ్రీకాకుళం ఎంపిక అవ్వటంతో జిల్లా అధికారులు అనందం వ్యక్తం చేశారు. ఉపాధి పనుల నిర్వహణలో జిల్లా కలెక్టర్ నివాస్ ప్రత్యేక శ్రద్ధ వహించడం, నిరంతర పర్యవేక్షణ, చక్కటి సూచనలు అవార్డు రావడానికి కారణమైందని డ్వామా పీడీ కూర్మారావు పేర్కొన్నారు. కలెక్టర్ నివాస్‌ను, డ్వామా పీడీ కూర్మారావును మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. ఈ నెల 19న దిల్లీలో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ నివాస్ పురస్కారాన్ని అందుకోనున్నారు.
నరేగా అమలులో రాష్ట్రానికి నాలుగు అవార్డులు
నరేగా అమలులో రాష్ట్రానికి నాలుగు అవార్డులు లభించాయి. పారదర్శకత, జవాబుదారీతనం, కొత్త ఆవిష్కరణ విభాగాల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ప్రభావవంతంగా పథకం అమలు విభాగంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
నరేగా అమలులో రాష్ట్రానికి నాలుగు అవార్డులు