COMPLAINT: గత శనివారం శ్రీ సత్యసాయి జిల్లా శెట్టిపల్లి తండాకు చెందిన లలితాబాయి అనే మహిళ.. మాజీ మంత్రి శంకర్ నారాయణను నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికార పార్టీ వారి నుంచి ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆమె కొత్తచెరువు పోలీసులకు ఆశ్రయించింది. మాజీమంత్రని దూషించినందుకు భైరాపురం గ్రామసచివాలయం వద్ద రామచంద్ర అనే వ్యక్తి తనని చంపడానికి కొడవలి పట్టుకుని తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగింది..:పింఛన్ తీసేశారంటూ మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మల్యే శంకర నారాయణపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లలితాబాయి అనే మహిళ ఇంటికి వెళ్లారు. 11 నెలలుగా పింఛన్ నిలిపివేశారని రగిలిపోతున్న లలితాబాయి ఇదే విషయంపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఐతే మళ్లీ వస్తానంటూ శంకరనారాయణ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.