Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 49వ రోజు పూర్తయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ముత్యాలమ్మ చెరువు వద్ద టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను పరిశీలించిన లోకేశ్.. జగన్ ప్రభుత్వం పది శాతం పనులు కూడా పూర్తిచేయలేక లబ్ధిదారులను ఇబ్బందులకు చేస్తోందని మండిపడ్డారు.
పాల్గొన్న ఎమ్మెల్సీలు, గంటా... మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పులగంపల్లి వద్ద పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్‌కు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో పాదయాత్రలో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్సీలతోపాటు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నారా లోకేశ్‌ను కలిసి కొంత దూరం పాదయాత్రలో పాల్గొన్నారు.
ప్రజలను పలకరిస్తూ... ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్లో ఆశలు చిగురింప చేస్తూ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. మూడు రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర సాగించారు. మంగళవారం ఉదయం కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మార్గమధ్యంలో ప్రజలను పలకరించుకుంటూ సాగింది. భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులతో కలిసి నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు.
హంద్రీనీవా వద్ద సెల్ఫీ... కదిరి మండలం ముత్యాలమ్మ చెరువు వద్ద టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లోకేశ్ పరిశీలించి ప్రభుత్వ వైఫల్యంగా చెప్పారు. తొంబై శాతం నిర్మాణం పూర్తిచేసిన ఇళ్లు, పదిశాతం పనులు చేయలేక జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు సొంత ఇంటి కల దూరం చేసిందని విమర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. అక్కడినుంచి చిన్నగుట్ట తాండ వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి, టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కాలువలు, నిర్మించి ప్రజలకు నీరందించామని, ఇది వాస్తవ అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. కాలువ వద్ద సెల్ఫీ తీసుకున్నారు.