Bridge Collapsed in Sri Satyasai District : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో పోచనాపల్లి రహదారిలో పెన్నానదిపై వంతెన కూలి పది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగు నెలల క్రితమే ఈ వంతెన కూలే ప్రమాదం ఉందని ఆర్ అండ్ బీ ఇంజనీర్లు గుర్తించారు. దీనికి తక్షణ మరమ్మతులు చేయాలని టెండర్లు ఆహ్వానించగా.. ఒక్క గుత్తేదారు కూడా పనులు చేయటానికి ముందుకు రాలేదు. సకాలంలో మరమ్మతులు చేయకపోవటంతో రెండు నెలల క్రితం వంతెన కూలిపోయింది. దాదాపు నెలన్నరపాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా.. ఇరవై రోజుల క్రితం కేవలం ద్విచక్ర వాహనం వెళ్లేలా తాత్కలిక ఇనుప వంతెన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన పది గ్రామాలు, కర్ణాటకకు చెందిన 11 గ్రామాల ప్రజలు హిందూపురానికి రావటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలే రాకపోకలు తిరిగి ప్రారంభించారు: కూలుతున్న వంతెనల మరమ్మతులు చేయించటం అధికారులకు కత్తిమీద సాములా మారింది. మూడున్నరేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఆర్ అండ్ బీ వంతెనలకు కనీసం వార్షిక నిర్వహణ పనులు కూడా చేయలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో పెన్నా, చిత్రావతి, వేదవతి నదులకు భారీ వరదలు రావటంతో బలహీనంగా ఉన్న వంతెనలు చాలా వరకు కూలిపోయాయి. దీంతో గ్రామస్థులే తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్దరించారు.
భయపడిన అధికారులు: ఇక ఆర్ అండ్ బీ రహదారులపై ఉన్న వంతెనలు కూలుతుండగా, ప్రజలు నిలదీస్తారని అధికారులు అటువైపు వెళ్లటానికే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పాత వంతెనలకు నిర్వహణ లేకపోవటం, దెబ్బతిన్న వాటిని మరమ్మతులు చేయకపోవటంతో ఏ రోజు ఏ వంతెన కూలుతుందో, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. వంతెనలు కూలిన మరికొన్ని చోట్ల అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు అటువైపు వెళ్లలేక ముఖం చాటేసి తిరుగాల్సి వస్తోంది. హిందూపురం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోని పోచానపల్లి రహదారిలో ఉన్న పెన్నానది వంతెన రెండు నెలల క్రితం పూర్తిగా కూలిపోయింది. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 20 కి పైగా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.