ప్రకాశం జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో నిర్మించిన పొంగలిశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డి దంపతులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వై.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఆలయ ముఖ మండపానికి 4 కోట్ల రూపాయల గ్రాంట్ మంజూరైనట్లు తెలిపారు. 2 కోట్ల రూపాయలు తితిదే నుంచి, మరో 2 రెండు కోట్లు దేవాదాయ శాఖ నుంచి నిధులు రానున్నట్లు చెప్పారు.
దేవస్థానం పక్కనే ఉన్న భవనాసి చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ కృష్ణ చైతన్య, దేవస్థాన ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు.