చిరుధాన్యాలతో లాభాలు సాధిస్తున్న ప్రకాశం జిల్లా యువకుడు ప్రకాశం జిల్లా మద్దపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన దండు చైతన్య ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ ఫైనాన్షియల్ బ్యాంక్ జేపీ మోర్గాన్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా బెంగళూరులో ఉద్యోగం చేసేవారు. సాఫీగా సాగుతూ ఉండే జీవితం... కానీ అతని మనసంతా పుట్టి, పెరిగిన ఊరు మీదే ఉండేది. డాలర్లతో జీవితం పరిపూర్ణం కాదనుకున్నాడు. వ్యవసాయ కుటుంబ నేపథ్యమున్న చైతన్యకు సొంత ఊరు వెళ్ళి వ్యవసాయాధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించాడు. తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని తలిచాడు.
ఆలోచన వచ్చిందిలా..
బ్యాంకు పనిమీద వివిధ దేశాలు పర్యటించినప్పుడు వ్యవసాయ పద్ధతులు, ప్రజల ఆహారపు అలవాట్లు ఆయన్ను ఆలోచింపజేశాయి. భవిష్యత్తు అంతా చిరుధాన్యాలదే అనుకున్నాడు. అంతే తన ఉద్యోగం వదిలి సొంతూరు వచ్చి.. చిరుధాన్యాల వ్యాపారం వైపు దృష్టి మళ్ళించాడు.
అలా మొదలైంది...
బెంగళూరులో పని చేసేటప్పుడు స్నేహితులతో కలిసి వారాంతాపు సెలవులు గడిపేందుకు ఓ సారి కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్లోని డా. నారాయణరెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అక్కడే వారం రోజులపాటు శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త డా.ఖాదర్ వలీ ఉపన్యాసాలు విని చిరుధాన్యాల మేలు గురించి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే వచ్చే షుగరు, బీపీ నుంచి తప్పించుకునేందుకు చిరుధాన్యాలే మంచి ప్రత్యామ్నాయమని ఆలోచించారు. చిరుధాన్యాలపై కొంత పరిశోధన సాగించి చివరికి శుద్ధి చేసే వ్యాపారంలోకి ప్రవేశించారు. రాగులు, కొర్రలు, అండ్రు కొర్రలు, సజ్జలు, సామలు, ముడి ధాన్యాలు సేకరించి.. ఎగుమతులకు అనుకూలంగా శుధ్ధి చేస్తారు. ప్రత్యేక ప్యాకింగ్‌లు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు.
ప్రోత్సహిస్తూనే లాభాల బాట..
రైతుల్లో అవగాహన పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న చైతన్య... స్థానిక మండలాల రైతులను ప్రోత్సహించి చిరుధాన్యాలు సాగు చేసేలా చేస్తున్నారు. విత్తనాలను ముందే ఇస్తూ.. వచ్చిన పంట మొత్తాన్నీ కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. బైబ్యాక్ విధానంతో రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిశ్రమ రావడం వల్ల వారంలో ప్రతి రోజూ పని లభిస్తోందని కార్మికులు పేర్కొంటున్నారు. మొదట్లో మంచి ఉద్యోగం వదిలి వస్తామంటే చాలా ఆలోచించామని.. అయితే తన కుమారుడు చేసే పని ద్వారా ఈ ప్రాంతంలో చిరుధాన్యాల సాగు పెరిగే అవకాశం ఉంటుందని చైతన్య తండ్రి అంజిరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువు ముగిసిన దగ్గర నుంచి ఉద్యోగ ప్రయత్నాలతోనే తలమునకలవుతున్న యువత... తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడి ఉంటున్నారని చైతన్య అంటున్నారు. చిన్న ఆలోచన... చుట్టు పక్కల పరిస్థితులను బాగు చేస్తాయి... ఓ గట్టి ప్రయత్నం జీవితాన్ని మార్చేయగలదని ఈ యువకుడి ప్రయత్నాన్ని చూస్తే అర్థమవుతోంది.
ఇదీ చదవండి:
15 ఏళ్లకే కథలు రాసేస్తారు... నాటకాలు వేసేస్తారు..!