ప్రకాశం జిల్లా ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పుస్తక పఠనాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బడిలోని గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని సృజనాత్మకత పెంచుకుంటున్నారు. కథలు, నాటికల ద్వారా జాతీయ స్థాయి వేదికల్లో పేరు సంపాదించారు.
కథలు రాసేస్తున్నారు
నీతికథలు చదివిన పిల్లల్లో మంచి నడవడిక అలవాటవుతుంది. అవే కథలు పిల్లలు రాస్తే నిజంగా అభినందించాల్సిందే. ఆ విద్యార్థులు అదే చేస్తున్నారు. నిత్యం పుస్తక పఠనంతో భాష మీద పట్టు సాధించారు. 15 ఏళ్లకే కథలు, నాటికలు రాసే స్థాయికి ఎదిగారు. రాయడమే కాదు వాటిని వినసొంపుగా చెప్పడంలోనూ మెప్పిస్తారు. కథల్లో జీవం ఉట్టిపడేలా రాయడం వారి ప్రత్యేకత. ఇటీవల గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కథల పోటీల్లో షేక్ మస్తాన్ అనే విద్యార్థిని ప్రథమ బహుమతి అందుకుంది.
పుస్తక పఠనంతోనే సాధ్యం
ఈ విజ్ఞానమంతా పుస్తక పఠనంతోనే అలవడిందని చెప్తారు విద్యార్థులు. ఇదంతా తమ పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాల కొరత లేకుండా చూసిన ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ప్రకాశం గ్లోబల్ ఎన్నారై సంస్థ ప్రతినిధులు గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందిస్తే... ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలతో ఇంకొన్ని కొనుగోలు చేశారు. తెలుగు ఉపాధ్యాయిని ఝాన్సీ.. విద్యార్థులకు కథలు, కవితలు రాయడం అలవాటు చేశారు. వీరు ప్రదర్శించిన నాటిక రాష్ట్ర స్థాయిలో నంది బహుమతి అందుకుంది. అంతే కాదు దిల్లీలోనూ నాటకం ప్రదర్శించే స్థాయికి చేరుకున్నారీ విద్యార్థులు. పుస్తక పఠనం కేవలం తమలోని సృజనాత్మకత వెలికి తీయడమే కాకుండా బట్టీ చదువులకు స్వస్తి పలికి చదువుని ఇష్టంగా మార్చిందని ఆనందంగా చెబుతున్నారు అక్కడి విద్యార్థినులు.
ఇవీ చదవండి: