ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో ఓ దళిత మహిళా రైతు కన్నీటి పర్యంతమైంది. మార్కాపురం మండలం కోల భీమునిపాడుకు చెందిన వెంకటమ్మ అనే మహిళకు.. ఆమె పూర్వీకుల నుంచి రెండెకరాలు భూమి సంక్రమించింది. అయితే తమ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు.. ఆ స్థలం గ్రామ సచివాలయానికి కావాలంటున్నారని.. ఆ నెపంతో తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆర్డీవో ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికే సాగు చేసుకున్న పత్తి పంటను నాశనం చేశారని బాధితురాలు వాపోయింది. సచివాలయానికి కావాలంటే గ్రామానికి సమీపంలోని ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని ఆమె తెలిపింది. కేవలం తాము వైకాపాకు ఓటు వేయలేదనే ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. తనకు ఆ రెండెకరాల పొలం మాత్రమే ఉందని తెలిపింది. అది తమకు చెందకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది. దీనిపై స్పందించిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.. దళిత రైతుకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ ఆర్డీవో శేషురెడ్డిని కోరగా.. పరిశీలించి తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దళిత మహిళా రైతు కన్నీటి పర్యంతం.. కారణమేంటంటే..! - women crying for her land in prakasham latest news
ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీవో ఎదుట ఓ దళిత మహిళా రైతు కన్నీటి పర్యంతమైంది. తన సాగుభూమిని గ్రామ సచివాలయ నిర్మాణం కోసం కావాలంటూ వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని కోల భీమునిపాడుకు చెందిన వెంకటమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది.

దళిత మహిళా రైతు కన్నీటి పర్యంతం.. వైకాపా నాయకులే కారణం
వైకాపా నేతలు బెదిరిస్తున్నారని ఆర్డీవో ఎదుట కన్నీటి పర్యంతమైన దళిత మహిళా రైతు