చోరీకి ప్రయత్నించారు..సీసీ కెమెరాకు బుక్కయ్యారు! - prakasham
ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో సిండికేట్ బ్యాంకులో చోరీకి దొంగలు యత్నించారు. సిబ్బంది వచ్చిచూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. అంతా సరిగానే జరుగుతుందనుకున్నారు దొంగలు. కానీ వారు చేసేదంతా...సీసీ ఫుటేజీలో రికార్డు అయింది.
ఉదయం వచ్చి చూసిన సిండికేట్ బ్యాంకు అధికారులకు చోరీకి యత్నించినట్లు అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు . బ్యాంకు లోపలకు చొరబడేందుకు బ్యాంకు భవనం షటర్ పగలగొట్టేందుకు దొంగలు తీవ్రంగా ప్రయత్నించారు. తాళాలు రాకపోవడంతో పరారయ్యారు. ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయింది. చీరాల డీఎస్పీ యు.నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బ్యాంకు వద్దకు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు వారాల క్రితం మార్టూరు మండలం ద్రోణాదులలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చోరీకి విఫలయత్నం జరిగింది. షటర్ తాళాలు పగులగొట్టిన దొంగలు లాకర్ తెరవడం సాధ్యం కాక వెనుదిరిగారు. రెండు దొంగతనాలు ఒకేలా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు లేకనే ఇలా జరుగుతుందని ఖాతాదారులు వాపోతున్నారు.