ఆత్మవిశ్వాసం పెంపొందించడం, అపాయాల్లో తమను తాము రక్షించుకునేలా డ్వాక్రా మహిళలకు కరాటే శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. తొలి దశలో జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 50 నుంచి 60 మంది డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇస్తారు. వారి ద్వారా జిల్లాలోని మిగిలిన ప్రాంతాల వారికి కరాటే నేర్పిస్తారు. ప్రయోగాత్మకంగా ఒంగోలును ఎంపిక చేసి... కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 21 నుంచి 35 ఏళ్ల లోపు మహిళలను శిక్షణకు ఎంచుకున్నారు.
ఆమె ఇక సబల... మహిళలకు మార్షల్ ఆర్ట్స్!
మృగాళ్ల దాడులు పెరుగుతున్న తరుణంలో మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనివార్యం అవుతోంది. కానీ చాలా మంది స్త్రీలు ఖర్చుకు భయపడో... అవగాహన లేకనో శిక్షణ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ సమస్యలను గమనించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు కరాటే శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా ఒంగోలును ఎంపిక చేసి.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మెప్మా ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎన్.లక్ష్మీసామ్రాజ్యం... కరాటే శిక్షణ ఇస్తున్నారు. 5 రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో మహిళలకు పౌష్టికాహారం అందిస్తారు. చివరిరోజు సర్టిఫికేట్ ఇస్తారు. వీరంతా జిల్లాలో మరికొందరికి శిక్షణ ఇస్తూ ఉపాధి పొందవచ్చు. ప్రకాశం జిల్లాలో 39 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మెప్మా అధికారులు తెలిపారు. తమలో ధైర్యం నింపుతూ ఆత్మవిశ్వాసం పెంపొందించే మార్షల్ శిక్షణ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.