ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చనిపోయాడని అంత్యక్రియలు చేశారు... తిరిగొచ్చాక ఆశ్చర్యపోయారు..!

నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.. పోలీసులు ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకున్నారు. మృతదేహాన్ని సంబంధిత కుటుంబీకులకూ అప్పగించారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించి... అంత్యక్రియలూ పూర్తి చేశారు. కానీ అతను ఇప్పుడు బతికే ఉన్నాడని.. మృతి చెందలేదని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరిగిన ఘటన వివరాలివి..!

The dead man is still alive
పొట్లపాడు గ్రామంలో చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు..

By

Published : Jan 27, 2020, 6:11 PM IST

Updated : Jan 27, 2020, 7:24 PM IST

చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు..!

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో ఓ కుటుంబానికి, పోలీసులకు ఆశ్చర్యం కలిగించే విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు. గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటరావు (45), అంజనాదేవి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వెంకటరావు దినసరి కూలి. ఇతను కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా కూలి పనులకు వెళ్లి.. కొంత మొత్తంలో డబ్బు సంపాదించుకొని ఇంటికి తిరిగి వస్తుంటాడు. ఇదే క్రమంలో కనుమ పండుగ మరుసటి రోజున ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు.

మృతదేహం నీ భర్తదే...గ్రామస్థులు

ఈ నెల 22వ తేదీ కురిచేడు రైల్వేస్టేషన్​ సమీపంలోని కుంట నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నీటిలో పడి ఉన్న శవాన్ని పరిశీలించి చుట్టుపక్కల గ్రామస్థులను విచారించగా... ఇతను పోట్లపాడుకు చెందిన పోలెబోయిన వెంకటరావుదిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. భర్త మరణ వార్త తెలుసుకున్న అంజనాదేవి తన మరిది కొండలుతో కలసి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించింది. మొదట తన భర్త కాదని తేల్చి చెప్పింది. అయితే శవం శరీరంపై కొన్ని ఆనవాళ్లు గుర్తించిన గ్రామస్థులు వెంకటరావుదేనని చెప్పారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కురిచేడు ఎస్ఐ కేసు నమోదుచేసి... మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. వారు చేసేది లేక ఇంటికి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

అజ్ఞాతవ్యక్తి సమాచారంతో

ఆదివారం రాత్రి అంజనాదేవికి ఓ వ్యక్తి ఫోన్ చేసి నీ భర్త బతికే ఉన్నాడని చెప్పటంతో కథ మలుపు తిరిగింది. ఫోన్ చేసిన వ్యక్తి తన చరవాణిలో వెంకటరావు తర్లుబాడు మండలంలోని రాయవరం తిరునాళ్లలో తిరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించి కుటుంబ సభ్యులకు సందేశం పంపాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పొట్లపాడు నుంచి కొంతమంది వ్యక్తులతో కలసి రాయవరం వెళ్లి వెంకటరావును ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయాడనుకున్న వ్యక్తి... ఇంటికొచ్చేసరికి భార్య, పిల్లలు, బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామస్థులు, పోలీసులు మాత్రం ఇదేమి విచిత్రం..అని ముక్కు మీద వేలేసుకున్నారు.

ఆ శవం ఎవరిది..?

వెంకటరావు కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన శవం ఎవరిదై ఉంటుందనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై ఎస్ఐ రామిరెడ్డిని కలవటానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోయేసరికి ... చరవాణి ద్వారా వివరణ కోరారు. పొట్లపాడు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే తాము మృతదేహాన్ని అప్పగించామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

చిన్నారుల సరదా.. చెరువులో మునిగి ముగ్గురు దుర్మరణం

Last Updated : Jan 27, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details