ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ క్వారీలకు పెట్టింది పేరు. భూమి లోతుల్లోకి వెళ్లి క్వారీ రాళ్లను వెలికి తీయడమే గాక భారీ వాహనాలతో దేశ, విదేశాలకు తరలిస్తుంటారు. నిత్యం వందలాది లారీలు పెద్దపెద్ద గ్రానైట్ రాళ్లతో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే క్వారీలకు వెళ్లే మార్గాలన్నీ సాగు, తాగునీరు అందించే కాల్వల వెంటే ఉన్నాయి. ప్రతి క్వారీ చుట్టూ 20 మీటర్ల కనీస స్థలం బఫర్ జోన్‌గా ఖాళీగా ఉంచాల్సి ఉన్నా యజమానులు పూర్తిగా తవ్వేస్తుండటంతో రహదారులు, కాల్వగట్లు పాడైపోతున్నాయి. ఇటీవల కేవీ.పాలెం సమీపంలో కారుమంచి మేజర్ కాలువ ఇదే విధంగా పూర్తిగా క్వారీలోకి కూరుకుపోయింది. గట్టు పూర్తిగా కోతకు గురై మొత్తం నీరంతా క్వారీలోకి మళ్లిపోయిందని రైతులు వాపోయారు.
రామతీర్థ సాగర్ రిజర్వాయర్ నుంచి దిగువకు వెళ్లే కాలువ గట్లే క్వారీ వాహనాలకు ప్రధాన రహదారులుగా మారాయి. వందల టన్నుల బరువుతో లారీలు గట్ల మీద ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీనివల్ల గట్లు బలహీనమవుతున్నాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడి తీవ్ర ఇబ్బందుల పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గట్లు శిథిలమై నీటిపారుదలకు ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు అంటున్నారు. దీని వల్ల సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.