71వ గణతంత్ర వేడుకలు ప్రకాశం జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ పోలా భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. అనంతరం ఒంగోలుకే ప్రత్యేకమైన ఒంగోలు గిత్తలను ప్రదర్శించారు. వీటితో పాటు వ్యవసాయ, జల వనరులు, విద్యా, గిరిజన సంక్షేమ శాఖల శకటాలను ప్రదర్శించారు. ఆయా రంగాల్లో చేస్తున్న నూతన విధానాలను తెలిపేలా ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు గంగవరపు వందనం, ప్రకాశం పంతులు గారి మనుమడు పంతులును సత్కరించారు.
అద్దంకిలో
ప్రకాశం జిల్లా అద్దంకిలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో అధికారులు జెండా ఎగురవేశారు. అద్దంకి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పోలీసులు, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
యర్రగొండపాలెంలో
యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో 71వ గణతంత్ర ఉత్సవాలు వినూత్నంగా జరిగాయి. 300 మంది విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణ ధరించి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా కొలుకుల సెంటర్ నుంచి పుల్లల చెరువు కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలు చేతబట్టి హిందూ, ముస్లిం బాయీ, బాయీ... బోలో భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈద్గా ప్రాంగణంకు ముస్లింలందరూ చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.