ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జూదరులను, నిర్వాహకులను పట్టుకుని నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతవరం కోళ్ల ఫారాల వద్ద మొత్తం 35 మంది జూదరులను అరెస్టు చేసి రూ.13 లక్షల 24 వేల నగదు.. 31 చరవాణులు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఇంకొల్లు సీఐ టి.సుబ్బారావు తెలిపారు. పట్టుబడిన వారిలో గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ తదితర ప్రాంతాలకు చెందినవారితో పాటు ఓ ప్రజాప్రతినిధి, రౌడీషీటర్ ఉన్నారు.
జూదరుల అరెస్టు విషయంలో 18 గంటల పాటు హైడ్రామా నడిచింది. ముందుగా.. గుంటూరు జిల్లాకు చెందిన పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. మధ్యాహ్నం... చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జూదరులను యద్దనపూడి పోలీసు స్టేషన్‌కు తరలించడం చర్చనీయాంశమైంది. మరోవైపు.. స్టేషన్ ఆవరణలో చిలకలూరిపేట, యద్దనపూడి పరిధిలోని పోలీసులను పెద్దఎత్తున మోహరించారు.
అంతకుముందు...
గుంటూరు - ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని కొంతమంది జూద శిబిరాలకు అడ్డాగా మార్చేశారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జూదరులను రప్పించి పేకాట ఆడిస్తున్నారు. జిల్లాతో పాటు ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారు. నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.