ప్రకాశం జిల్లాలో రక్త అవసరాల కోసం రిమ్స్, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలపై ఆధారపడాల్సిందే. ఇతర రక్తనిధి కేంద్రాలు ఉన్నా... ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు వీటినే ఆశ్రయిస్తుంటారు. ఒంగోలులో ఏళ్లతరబడి సేవలందిస్తున్న రెడ్‌క్రాస్ సంస్థ అరకొర సౌకర్యాలతోనే నెట్టుకొస్తుంది. నగరం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటం వల్ల ప్రమాదాలతో పాటు.. రక్త అవసరాలూ ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న రెడ్‌క్రాస్ భవనంలో రెండు ఫ్రిజ్‌లు మాత్రమే ఉండగా 150 యూనిట్లకు మించి నిల్వ చేయలేకపోతున్నారు. అవసరమైన పరికరాలు లేక కేవలం రక్తసేకరణ మాత్రమే చేస్తున్నారు. ప్లేట్‌లెట్లు, ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, క్రయో కాంపొనెంట్లకు తగిన సౌకర్యాలు లేవు. పాత భవనం చిన్నదిగా ఉండటం, ఆధునిక పరికరాలు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రస్తుతం ఉన్న భవనం శిథిలమవ్వగా.. కొత్త మార్కెట్ సమీపంలో నూతన భవనం నిర్మించారు. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సాయంతో రూ.60 లక్షలు వెచ్చించి అన్ని హంగులతో 2018లోనే నూతన భవనం నిర్మించినా... ఇప్పటికీ ప్రారంభించలేదు. ఇక్కడ కూడా ఆధునిక పరికరాల ఏర్పాటు చేయలేదు. కేవలం రక్తదాన శిబిరాలు, అవగాహన సమావేశాలకే ఈ భవనం పరిమితం కానుంది. కొత్త భవనంలో ఆధునిక పరికరాలు ఏర్పాటుచేసి, వెంటనే బ్లడ్‌బ్యాంకును అక్కడికి తరలించాలని నగరవాసులు కోరుతున్నారు.