అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నియోజకవర్గ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్యే కోరారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటంతో వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్యం పనుల గురించి కమిషనర్ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే బలరాంకు వివరించారు.
చీరాల ఏరియా వైద్యశాల, స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో క్వారంటైన్ వార్డుల గురించి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా పట్టణంలో తీసుకుంటున్న ఆంక్షల గురించి చీరాల సీఐలు ఎన్. నాగమల్లీశ్వరరావు, ఫిరోజ్లు వివరించారు. ప్రజల్లో అవగాహన కలిపిస్తున్న పోలీస్, వైద్య, మున్సిపల్, మీడియాను ఎమ్మెల్యే అభినందించారు.