తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించారు. లోకేశ్‌కు మతి భ్రమించిందని విమర్శించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తనను హవాలా మంత్రి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. చెన్నై బంగారు వర్తకుడి వద్ద దొరికిన డబ్బుకు తనకు సంబంధం లేదనే విషయాన్ని ఆరోజే స్పష్టం చేసినట్లు తెలిపారు.
'నేను పేకాడతాను.. అది నా వ్యక్తిగతం. గత 20 ఏళ్ల నుంచి నా మీదున్న ఏకైక విమర్శ అది. మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పెద్ద చిట్టానే ఉంది. కానీ నాకు సంస్కారం ఉంది. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ చాలా మంది దగ్గర అప్పులు తీసుకొని తిప్పిస్తున్నారు. అతని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలను'- బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి
స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు.. వాస్తవాలు తెలుసుకోని లోకేశ్ మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. ప్రచారానికి వచ్చిన వారు ప్రచారం చేసుకొని వెళితే బాగుంటుందన్న ఆయన.. వ్యక్తిగత ఆరోపణలు చేయటం కుట్ర రాజకీయాలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. లోకేశ్ కనీసం నగర కార్పొరేటర్‌గా కూడా గెలవలేరని ధ్వజమెత్తారు.