contractors problems due to pending bills: గుంటూరు జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరైన భోజనం అందడం లేదు. గుత్తేదారులకు భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. జిల్లాలో బోధన, జిల్లా, ప్రాంతీయ వైద్యశాలల్లో భోజన బిల్లులు లక్షల రూపాయల్లో పెండింగులో ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో అయితే.. రెండేళ్లుగా ఏడు కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. ఫలితంగా గుత్తేదారులు మెనూ ప్రకారం భోజనాలు అందించలేకపోతున్నారు. జిల్లా నుంచి బిల్లులు నిర్ధరించి సీ.ఎఫ్.ఎమ్.ఎస్‌కు పంపించినా అక్కడ నెలల నెలల తరబడి పెండింగులోనే ఉన్నాయి. గుంటూరు బోధనాస్పత్రిలో రోజుకు సగటున 1500 మంది వరకు భోజనాలు అందిస్తారు. బిల్లులు బకాయిలు పడినప్పటికీ.. గుత్తేదారులు అప్పులు చేసి రోగులకు భోజనం సమకూరుస్తున్నారు.
ఎన్ని బిల్లులు పంపుతున్నా చిల్లిగవ్వ రావట్లేదు..
గుంటూరుతో పాటు.. తెనాలి జిల్లా ఆస్పత్రి, సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలల్లో ఉండే రోగులకు డైట్ కాంట్రాక్టర్ల ద్వారా భోజనం పెడుతున్నారు. ఇన్ పేషెంట్లతో పాటు సహాయంగా వచ్చే వారిలో ఒకరికి ప్రభుత్వమే ఉచితంగా భోజనం పెడుతోంది. గర్భిణీలు, బాలింతలకు ప్రొటీన్ డైట్ అందిస్తారు. వీటికి వేర్వేరు ధరలు ఉన్నాయి. ఈ మేరకు బిల్లులు తయారుచేసి పంపుతున్నా.. క్లియర్ కావడం లేదని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రిలో బాలింతలు, గర్భిణీలు, రోగులకు పోషకాహారం అందడం లేదు. నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాత బకాయిలి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. జీజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు.
భోజనాల్లో కరోనా రోగులు ప్రస్తుతం తక్కువ మంది ఉన్నారు. దాదాపు 50, 60 మంది ఉన్నారు. నాన్ కొవిడ్‌లో స్ట్రెంత్ 12 వేల 600. ప్రస్తుతం దాదాపు 1500 మంది ఉన్నారు. వారందరికీ నిరంతరాయంగా భోజనాలు అందిస్తున్నాం. భోజనాల బిల్లులు కొవిడ్ బడ్జెట్‌కి సబ్మిట్ చేశాం. డబ్బులు రాగానే వారికి ఇచ్చేస్తాం.
- ప్రభావతి, జీజీహెచ్ సూపరింటెండెంట్
కరోనా సమయంలోవి కూడా నేటికీ అందలేదు..
ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ.. గుత్తేదారులకు బిల్లులు రాకపోవడం వల్ల రోగులకు భోజనంలో కోతలు తప్పడం లేదు. కొవిడ్ రెండో దశ సమయంలో ఇన్ పేషెంట్లకు పెట్టిన భోజనాలకు సంబంధించి బిల్లులు ఇప్పటివరకూ అందలేదు. ఒంగోలు రిమ్స్‌లోనే దాదాపు రెండు కోట్ల వరకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. జననీశిశు సురక్షణ బిల్లులు జీజీహెచ్‌లో గత ఏడాది మార్చి నుంచి నిలిచిపోయాయి. వీటి కోసం గుత్తేదారులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.