కొత్తపట్నం వద్ద సింగ్ హార్బర్ నిర్మాణానికి గతంలో రూ.280 కోట్లు అవసరం అవుతాయని ప్రణాళిక వేసి నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ఆ అంచనా రూ.350 కోట్లకు చేరింది. అన్ని అడ్డంకులు దాటి ఏర్పాటు పూర్తి అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. హార్బర్ లో సంప్రదాయ పడవలు, మేకనైజ్డ్ పెద్ద పడవలు పెద్ద సంఖ్యలో లంగరు వేసుకొనే అవకాశం ఉంటుంది. సేకరించిన మత్స్య సంపదను ఇక్కడికి తీసుకొచ్చి వ్యాపారనిమిత్తం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు జలమార్గంలోనే తరలించవచ్చు.
ఇప్పటివరకు లంగరు వేసే అవకాశం లేక పడవలను ఒడ్డుకు చేర్చి సముద్రంలోకి తీసుకెళ్లడం, మత్స్య సంపదను అంతేకష్టంగా రోడ్డు మార్గంగా ఇతర ప్రాంతాలకు చేర్చడంలో వ్యయప్రయాసలు తగ్గుతాయి. కె.పల్లెపాలెం పరిసరాలు వ్యాపార కేంద్రాలుగా మారుతాయి. సమీపంలో ఉండే ఒంగోలు కూడా వ్యాపారకేంద్రంగా మారుతుంది. ఐస్ తయారీ, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా వసతుల వల్ల జిల్లా మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది. ఇతర ప్రాంతాలకు వలసలు నివారించవచ్చు. అయితే దాదాపు 3వేల జనాభా ఉన్న పల్లెపాలెంలో అనేక సందేహాలతో ప్రజలు సతమతమవుతున్నారు. తమ ఇల్లు పోతాయని, వేటకు ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. అందులో భాగంగా ఇటీవల నిర్వహించిన గ్రామసభను కొందరు బహిష్కరించారు. హార్బర్ వద్దు అని నినదించారు.
300 కుటుంబాలకు ఇబ్బంది...
ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలకు గ్రామం నుంచే భూసేకరణ చేస్తారు. దాంతో దాదాపు 300 కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతాయి. గతంలో కూడా ఇక్కడ హార్బర్ ప్రతిపాదన చేయగా తాము వ్యతిరేకించడంతో అప్పటి ప్రభుత్వం వెనకడుగేసింది. మళ్లీ ఇప్పుడు. ప్రాజెక్టుతో ప్రజలకు ప్రయోజనం కల్పించే ఉద్దేశమే ఉంటే గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కొంచెం దూరంగా పక్కన ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడే ఏర్పాటు చేయాలని పట్టుపట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. -గేనం సుబ్బారావు, కె. పల్లెపాలెం