రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. దానికి సంబంధించిన కసరత్తు ప్రకాశం జిల్లాలో కూడా ప్రారంభమైంది. జనవరి 26లోపు జిల్లాల విభజనపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉండటంతో ఆ మేరకు పునర్విభజనపై జిల్లా పాలనాధికారి దృష్టి సారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా పునర్విభజనతో తలెత్తే పరిణామాలు ఏమిటి, అందరికీ ఆమోదయోగ్యంగా ఎలా విభజించాలి అన్న అంశాలపై జిల్లాలో చర్చలు సాగుతున్నాయి. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్లవారీగా ఏ నియోజకవర్గం ఎటు ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయిలో కసరత్తు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలో క్షేత్రస్థాయి కసరత్తు మొదలైంది. ఆ మేరకు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు కాగా, కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. దీంట్లో మరోనాలుగు సబ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆ క్రమంలోనే మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మానవ వనరులు, ప్రభుత్వ ఆస్థులు, మౌలిక వసతుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైటులో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా రెవెన్యూ విభాగం కూడా జిల్లా పునర్విభజన కసరత్తు ప్రారంభించింది. ఇందులో ఆస్తుల విభజన, అందుబాటులో ఉన్న వనరులు, తాత్కాలిక, దీర్ఘకాలికంగా కల్పించాల్సిన మౌలిక వసతులు, ఉన్న ఆస్తులు, ఇతర అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే క్షేత్రస్థాయి కసరత్తు, ప్రభుత్వశాఖల వారీగా సేకరిస్తున్న సమాచారం ఒంగోలు, బాపట్ల జిల్లాల ఏర్పాటు దిశగానే సాగుతున్నట్లు సమాచారం.
- యాభైఏళ్ల సాకారం...
నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి వెనకబడిన ప్రాంతాలను ఒకటిగా కలుపుతూ 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాగా అవిర్భవించింది. తర్వాత 1972 డిసెంబరు 5న జిల్లా ముద్దుబిడ్డ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లాగా మార్పుచెందింది. దాదాపు అరకోటి జనాభా, 17,626 కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద జిల్లాగా ఉండగా ఒంగోలు, చీరాల, మార్కాపురం, అద్దంకి, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, కొండెపి, సంతనూతలపాడు, పర్చూరు, దర్శి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాలు ఒంగోలు, బాపట్ల, కావలి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పునర్విభజన జరిగితే జిల్లా మూడు ముక్కలు ఖాయం.
- మూడు ముక్కలకు సంకేతాలు
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నాలుగు నెలల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును ఆనుకుని ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడం ఎలా కుదురుతుంది? అది చాలా దూరమని ముఖ్యమంత్రితో వ్యాఖ్యానించారని, ఈ సందర్భగా ఒక లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని ముందునుంచే అనుకున్నామని, అలానే ముందుకు సాగుదామని సీఎం కాస్త గట్టిగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. దీన్నిబట్టి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముందుకెళితే సంతనూతలపాడు బాపట్లకు, కందుకూరు నెల్లూరుకు వెళ్లి జిల్లా మూడు ముక్కలుకానుంది.
- ఒంగోలుకు ఆదాయం ఎలా?
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పునర్విభజనలో హేతుబద్దత ఉండదని, దానివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని జిల్లాలోని మేధావులు, భాషాభిమానులు, పలువురు నాయకులు అంటున్నారు. 25 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, ఆలెక్కన మరో పదేళ్లలో విభజన జరిగితే ఇప్పుడు మారిన ప్రాంతాలు మరోసారి గందరగోళంలో పడే అవకాశం ఉంటుందంటున్నారు. అలానే జిల్లాకు ఆదాయ వనరులుగా ఉన్న గ్రానైట్ గనులు, యూనిట్లు, ఇండస్ట్రియల్ ఏరియా, జీడిపప్పు పరిశ్రమ, రొయ్యల పరిశ్రమ, రామాయపట్నం పోర్టు, పొగాకు ఉత్పత్తుల ద్వారా జిల్లాకు వచ్చే ఆదాయం పోతుందని, ఆదాయవనరులు లేని ఒంగోలు జిల్లాతో నష్టపోతామన్న వాదన ఉంది.
- ‘ప్రకాశం’కు అర్థముండదు
సంతనూతలపాడు నియోజకవర్గంలోని వినోదరాయనిపాలెం ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ. ఆయన జ్ఞాపకార్థం ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆయన పేరున పేర్నమిట్ట వద్ద ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయం నిర్మించనున్నారు. సంతనూతలపాడు బాపట్లలో కలిస్తే ప్రకాశం పంతులు స్వస్థలం లేకుండా ఒంగోలుకు ఆయన పేరు ఉండటంలో అర్థముండదని భాషాభిమానులు అంటున్నారు. మార్కాపురం జిల్లా కావాలి.. వెనకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్ చేస్తోంది. అక్కడి ప్రజలు కూడా మార్కాపురం జిల్లాకు మొగ్గుచూపుతున్నారు. పలువురు మేధావులు, రాజకీయ నాయకులు కూడా ఆదిశగా గొంతు వినిపిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజన చేస్తే ప్రస్తుత జిల్లాలో చివరి గ్రామం ఉయ్యాలవాడ నుంచి ఒంగోలుకు 240 కిలోమీటర్లు, సీఎస్‌పురం కొత్తపల్లి నుంచి 196, రోళ్లపెంట నుంచి 161, మర్రివేముల నుంచి 131 కిలోమీటర్ల దూరం ఉందని, మార్కాపురం జిల్లాగా చేస్తే ఈ గ్రామాలకు సగం దూరం తగ్గుతుందంటున్నారు. జిల్లాకు కావాల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, పశ్చిమ ప్రాంత సుదీర్ఘ చరిత్రను ప్రస్తావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఆదిశగా కదిలి మార్కాపురం జిల్లా సాధనకు కృషిచేయాలని కోరుతున్నారు.
నెల్లూరు దూరం పార్లమెంట్ నియోజకవర్గం వారీగా చూస్తే కందుకూరు నెల్లూరు జిల్లాలోకి పోతుంది. కందుకూరు నుంచి ఒంగోలుకు 45 కిలోమీటర్లు దూరం కాగా, నెల్లూరుకు 120 కిలోమీటర్లు వస్తుందని, నెల్లూరు కంటే ఒంగోలు మేలని, విభజనతో చీమకుర్తి రామతీర్థం జలాలు కందుకూరుకు రావని చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం రాళ్లపాడుకు సోమశిల జలాలు వస్తాయని, రామాయపట్నం పోర్టు కూడా నెల్లూరులో ఉంటుందనకుంటున్నారు.